లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో 2029 వరకు మహిళా రిజర్వేషన్ల అమలును ముందుకు తీసుకెళ్లే మూడు బిల్లులపై జరిగిన చర్చలో పాల్గొంటూ మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించేవారు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకుంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రతిపక్షాలను హెచ్చరించారు. మహిళలు సభ్యులందరినీ గమనిస్తున్నారని, మహిళా కోటాను అడ్డుకోవాలనే ‘దురుద్దేశాలను’ వారు మరచిపోరని ఆయన స్పష్టం చేశారు.
“నారీ శక్తి మన నిర్ణయాన్ని (నిర్ణయాన్ని), అంతకంటే ముఖ్యంగా మన ఉద్దేశాన్ని (నీయత్ను) గమనిస్తూ ఉంటుంది. మన దురుద్దేశాలను వారు ఎప్పటికీ క్షమించరు,” అని ఆయన చెప్పారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వారెవరూ దేశాన్ని ముక్కలుగా చూడకూడదని, దానిని ఒకే జాతిగా చూడాలని ప్రధాని పేర్కొంటూ ఈ చర్చను ఉత్తర-దక్షిణ అనే రెండు వర్గాలుగా విభజించిన డీఎంకే, కొన్ని ఇతర పార్టీలను పరోక్షంగా వారించారు.
బిల్లులలో కోరినట్లుగా లోక్‌సభ విస్తరణ తర్వాత, రాష్ట్రాల దామాషా వాటాలో మార్పు ఉండదని హామీ, వాగ్దానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే తమిళంలో ఒక గట్టి మాట వాడటానికి కూడా సిద్ధంగా ఉన్నానని ప్రధాని తెలిపారు. 2023లోనే మహిళా రిజర్వేషన్‌ను త్వరగా అమలు చేయాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారని నొక్కిచెబుతూ, “మనం” మహిళా రిజర్వేషన్‌ను ఇంకెంతకాలం నిలిపివేయాలనుకుంటున్నాం అని మోదీ ప్రశ్నించారు.
కానీ, ఆ సమయంలో దానిని అమలు చేయడానికి 2024 చాలా దగ్గరవుతుందని చెబుతూదానిని ఇకపై ఆలస్యం చేయకపోవడమే ప్రస్తుత అవసరమని ఆయన చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయ కోణంలో చూడవద్దు అని ప్రధాని మోదీ హితవు చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏ పార్టీకి అనుకూలం కాదని పేర్కొంటూ దానికి రాజకీయ రంగు పూయవద్దని స్పష్టం చేశారు.
“దేశానికి సరికొత్త దిశను సూచించే ప్రయత్నం చేస్తున్నాం. దేశంలోని సగం జనాభాకు అధికారం ఇవ్వడం అద్భుత ఘట్టం. వికసిత్ భారత్ అంటే మౌలిక వసతుల కల్పనే కాదు.. మహిళలకు అధికారం ఇవ్వడం కూడా. వికసిత్ భారత్‌లో మహిళల భాగస్వామ్యమే లక్ష్యం. మహిళలకు అధికారమిస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారు. మహిళలకు నిర్ణయాధికారం ఇవ్వడమే మా లక్ష్యం. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవు. ఈ విషయంలో విపక్షాలను మహిళలు ఎప్పటికీ క్షమించరు” అని ప్రధాని చెప్పుకొచ్చారు.
ఎవరు బాధ్యులైనా, ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆలస్యం చేశామని, ఈ బిల్లులను తీసుకువచ్చిన విజయం ట్రెజరీ బెంచ్‌లకు కానీ, మోదీకి కానీ దక్కదని, ఇది భారత ప్రజాస్వామ్యానికి దక్కుతుందని ఆయన తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంలో క్రెడిట్ ఎవరిదన్న దానిపై ఆలోచించరాదని కోరుతూ కావాలంటే మీరు క్రెడిట్ తీసుకోవచ్చు అని ఆయన ప్రతిపక్షాలకు చెప్పారు.
ముందుగా 33 శాతం మంది మహిళలు ఇక్కడకు రావాలని పేర్కొంటూ భారతీయ సోదరీమణులను నమ్మండి అని, వారి ఇంటెలిజెన్స్‌ను గుర్తించాలని ప్రధాని అభ్యర్ధించారు. నారీ శక్తి వికసిత్ భారత్‌కు ఉపయోపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కానీ ఒకవేళ మూడు దశాబ్ధాల తర్వాత కూడా ఈ సంస్కరణ చేపట్టకపోతే, అప్పుడు ఆ లబ్ధి ఏ పార్టీకి దక్కదని తెలిపారు.
“పంచాయతీల్లో రిజర్వేషన్లకు అందరూ అంగీకరించారు. లోక్‌సభలో మాత్రం బిల్లును అడ్డుకుంటున్నారు. ఈ బిల్లుకు మద్దతిచ్చే రాజకీయ పార్టీలకే మనుగడ ఉంటుంది. 30 ఏళ్లలో ఇదే అంశం రుజువైంది. మహిళల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. అత్యున్నత చట్టసభల్లోనూ భాగస్వామ్యం కోరుతున్నారు. చీపురు పనికాదు.. పార్లమెంట్లో సీట్లు అడుగుతున్నారు. ఇప్పుడు బిల్లును వ్యతిరేకించిన వారిని మహిళలే శిక్షిస్తారు” అని మోదీ పేర్కొన్నారు.
More Stories
సైనిక ఘర్షణ సమస్యలను పరిష్కరించలేదు
కులగణన, రిజర్వేషన్ లపై అఖిలేశ్, అమిత్ షా మాటల హోరు
815 లోక్‌సభ సీట్లలో.. 272 సీట్లు మహిళలకే