హొర్ముజ్‌ దిగ్బంధం.. ఇరాన్‌ నౌకల రాకపోకలు బంద్‌

హొర్ముజ్‌ దిగ్బంధం.. ఇరాన్‌ నౌకల రాకపోకలు బంద్‌
హర్మూజ్‌ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌ ససేమిరా అంటుండగా ఆ దేశ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడం ప్రారంభించింది. ఇరాన్‌ ఓడరేవుల్లోకి ప్రవేశించే, అక్కడి నుంచి బయటకు వెళ్లే అన్ని నౌకలను అడ్డుకుంటోంది. తమ ఓడరేవులను దిగ్బంధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన ఇరాన్, తమ ఓడరేవుల భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఏ దేశపు ఓడరేవూ సురక్షితంగా ఉండదని ఇప్పటికే తేల్చిచెప్పింది. 

ఇరాన్‌ ఓడ రేవుల్లోకి రాకపోకలు సాగించే నౌకలను లక్ష్యంగా చేసుకుని సోమవారం ఉదయం 10 గంటలకు (భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7.30 గంటలకు) ఈ దిగ్బంధం అమల్లోకి వచ్చింది.   అరేబియా గల్ఫ్‌, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌సహా ఇరాన్‌ ఓడరేవులు, తీర ప్రాంతాలను ఉపయోగించే అన్ని దేశాల నౌకలపైన నిష్పాక్షికంగా ఈ చర్యను అమలు చేస్తున్నట్లు సెంట్‌కామ్‌ తెలిపింది.

సముద్ర జలాల్లో ఉండి గాలిలో, నేలపై, సముద్ర మార్గంలో ఇలా అన్ని విధాల దాడులను తిప్పికొట్టి, ఇరాన్​ను దెబ్బకొట్టేందుకు అమెరికా 15 అత్యంత శక్తిమంతమైన యుద్ధ నౌకలను మోహరించింది.  అయితే అమెరికా సైన్యం జలసంధిని పూర్తిగా మూసివేయలేదు. ఇరానేతర ఓడరేవులకు రాకపోకలు సాగించే నౌకల నౌకాయాన స్వేచ్ఛ కొనసాగుతుందని పేర్కొన్నది. ప్రపంచ నౌకా రవాణా మార్గాలకు పూర్తిగా అంతరాయం కలిగించకుండా, ఇరాన్‌ను ఏకాకిని చేయడమే లక్ష్యంగా ఇది ఒక క్రమబద్ధమైన విధానాన్ని అనుసరిస్తోందని సెంట్‌కామ్‌ సూచించింది. 

ఇరాన్‌ ఓడరేవుల్లోకి రాకపోకలు సాగించే అన్ని నౌకలకు ఈ దిగ్బంధం వర్తిస్తుందని సెంట్‌కామ్‌ తెలిపింది. తమ ఆదేశాలను ఉల్లంఘించిన నౌకలను అడ్డుకోవడం లేదా స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని స్పష్టంచేసింది. ఇరాన్‌కు చట్టవిరుద్ధమైన సుంకాలు చెల్లించే ఏ నౌక అయినా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ట్రంప్‌ హెచ్చరించారు. 

ఇరాన్‌ నౌకాదళానికి చెందిన 158 నౌకలు పూర్తిగా నాశనమై సముద్ర గర్భంలో కూరుకుపోయాయని, తాము దెబ్బతీయనవి వారి వద్ద ఉన్న ఫాస్ట్‌ అటాక్‌ షిప్స్‌ అని పిలుచుకునే కొద్ది సంఖ్యలోని నౌకలు మాత్రమేనని ట్రంప్‌ పేర్కొన్నారు. తాము వాటిని పెద్ద ముప్పుగా పరిగణించడం లేదని, అయితే ఈ నౌకలలో ఏవైనా తమ దిగ్బంధనానికి సమీపంలోకి వస్తే సముద్రంలో పడవల్లోని డ్రగ్స్‌ వ్యాపారులపై తాము ఉపయోగించే అదే విధ్వంసక పద్ధితిని ఉపయోగించి వాటిని తక్షణమే నిర్మూలిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు.

ట్రంప్‌ హెచ్చరికలపై వేగంగా స్పందిస్తూ హొర్ముజ్‌ జలసంధి సమీపంలో ఏ విదేశీ సైనిక ఉనికి అయినా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లుగానే పరిగణిస్తామని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) హెచ్చరించింది. తమ రేవులకు ముప్పు వాటిల్లిన పక్షంలో పర్షియన్‌ గల్ఫ్‌ లేదా ఒమన్‌ సముద్రంలోని ఏ ఓడరేవు కూడా సురక్షితంగా ఉండబోదని ఐఆర్‌జీసీ హెచ్చరించింది.