ఆర్టెమిస్‌-2 వెనుక భార‌తీయ సంత‌తి శాస్తస్రవేత్త అమిత్ క్ష‌త్రియా

ఆర్టెమిస్‌-2 వెనుక భార‌తీయ సంత‌తి శాస్తస్రవేత్త అమిత్ క్ష‌త్రియా

భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త,  ప్ర‌స్తుతం నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేట‌ర్‌ అమిత్ క్ష‌త్రియా  తాజాగా చంద్రుడిని వ్యోమ‌గాములు చుట్టి వ‌చ్చిన ఆర్టెమిస్‌2 మిష‌న్‌లో అత్యంత కీల‌క పాత్ర పోషించారు. నాసా స్పేస్ ఏజెన్సీలో ఈయ‌న రికార్డు అనిత‌రసాధ్యంగా ఉంది.  అడ్మినిస్ట్రేట‌ర్ జేర్డ్ ఇజాక్‌మాన్‌కు సీనియ‌ర్ స‌ల‌హాదారుడు కూడా.  ఫ‌స్ట్ జ‌న‌రేష‌న్ ఇండియ‌న్ ఇమ్మిగ్రాంట్స్‌కు క్ష‌త్రియ జ‌న్మించారు. విస్క‌న్‌స‌న్ ఆయ‌న జ‌న్మ‌స్థ‌లం. ప్ర‌స్తుతం ఏజెన్సీలో ఉన్న హైయ్య‌స్ట్ ర్యాంకింగ్ సివిల్ స‌ర్వెంట్‌. 

వాషింగ్ట‌న్‌లో ఉన్న నాసా హెడ్‌క్వార్ట‌ర్స్‌లో అసోసియేట్ అడ్మినిస్ట్రేర్‌గా, ఆ ఏజెన్సీకి చెందిన చీఫ్ ఆప‌రేటింగ్ ఆపీస‌ర్ కూడా వ్యవహరిస్తున్నారు.  కాలిఫోర్నియాలోని ప‌స‌డేనాలో ఉన్న కాలిఫోర్నియా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో మ్యాథ‌మెటిక్స్ స‌బ్జెక్ట్‌లో బీఎస్సీ చ‌దివారు. ఆస్టిన్‌లోని యూనివ‌ర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో ఎంఏ మ్యాథ‌మెటిక్స్ చ‌దివారు. విస్క‌న్‌స‌న్‌లోని బ్రూక్‌ఫీల్డ్‌లో జ‌న్మించారు. అయితే టెక్సాస్‌లోని హూస్ట‌న్ స‌మీపంలో ఉన్న శివారు ప్రాంత‌మైన క్యాటీని హోమ్‌టౌన్‌గా ఆయ‌న చెప్పుకుంటారు.

నాసా ప్ర‌యోగాల‌కు కేంద్రమైన జాన్సన్ స్పేస్ సెంట‌ర్‌లో చిన్న‌త‌నం నుంచి అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల‌ను వీక్షించేవారు. హుస్ట‌న్ స‌మీపంలోనే ఉండ‌డం వ‌ల్ల అంత‌రిక్ష ప‌రిశోధ‌న అంశాల్లో ఆయ‌నకు బాల్యం నుంచి ఆస‌క్తి పెరిగింది. గ్రాడ్యుయేష‌న్ త‌ర్వాత ఆయ‌న ఆయిల్ అండ్ గ్యాస్ ఇండ‌స్ట్రీలో ప‌నిచేశారు. ఆ త‌ర్వాత మెడిక‌ల్ రంగంలోనూ చేశారు.  2003లో నాసా స్పేస్ ప్రోగ్రామ్‌కు చెందిన యునైటెడ్ స్పేస్ అలియ‌న్స్ లో ఆయ‌న చేరారు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌, రోబోటిక్స్ ఇంజినీర్‌, స్పేస్‌క్రాఫ్ట్ ఆప‌రేట‌ర్‌గా నాసాలో అమిత్ క్ష‌త్రియా చేశారు. అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రానికి చెందిన రోబోటిక్ అసెంబ్లింగ్‌లో కీల‌క పాత్ర పోషించారు.  2014 నుంచి 2017 వ‌ర‌కు స్పేస్ స్టేష‌న్ ఫ్ల‌యిట్ డైరెక్ట‌ర్‌గా చేశారు. 2017 నుంచి 2021 వ‌ర‌కు ఐఎస్ఎస్ వెహిక‌ల్ ఆఫీస్‌లో డిప్యూటీ, తాత్కాలిక మేనేజ‌ర్‌గా చేశారు. అక్క‌డ ఇంజినీరింగ్, లాజిస్టిక్స్‌, హార్డ్‌వేర్ ప్రోగ్రామ్‌లు చూసుకునేవారు.

2021లో నాసా ప్ర‌ధాన కార్యాల‌యంలో ఎక్స్‌ప్లోరేష‌న్ సిస్ట‌మ్స్ డెవ‌ల‌ప్మెంట్ మిష‌న్ డైరెక్ట‌రేట్‌కు అసిస్టెంట్ డిప్యూటీ అసోసియేట్ అడ్మినిస్ట్రేట‌ర్ గా నియ‌మితుడ‌య్యారు. ఆర్టెమిస్‌1 మిష‌న్ స‌మ‌యంలో చంద్రుడి వ‌ద్ద‌కు వెళ్లేందుకు వ్యోమ‌గాముల‌కు అవ‌స‌ర‌మైన స్పేస్‌క్రాఫ్ట్‌ను ఆయ‌న డిజైన్ చేశారు.  నాసా చేప‌ట్టిన మూన్, మార్స్ ప్రోగ్రామ్‌ల‌కు డిప్యూటీ అసోసియేట్ అడ్మినిస్ట్రేట‌ర్‌గా చేశారు. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేట‌ర్‌గా అమిత్ క్ష‌త్రియాను ప్ర‌క‌టించారు.

ఆయ‌న‌కు నాసా ఔట్‌స్టాండింగ్ లీడ‌ర్‌షిప్ మెడ‌ల్‌ను అంద‌జేశారు. ఆస్ట్రోనాట్స్ ర‌క్ష‌ణ కోసం శ్ర‌మించిన క్ష‌త్రియాకు సిల్వ‌ర్ స్నూపీ అవార్డును కూడా బ‌హూక‌రించారు. భూమిపై ఓరియ‌న్ క్యాప్సూల్ దిగిన త‌ర్వాత‌ అమిత్ క్ష‌త్రియా మాట్లాడుతూ ఆర్టెమిస్ మిష‌న్ అనుకున్న‌దానిక‌న్నాఎక్కువే పనిచేసిన్నట్లు తెలిపారు. భ‌విష్య‌త్తులో చేప‌ట్ట‌బోయే మిష‌న్స్‌కు మూన్ బేస్ కావొచ్చ్చని చెప్పారు. మ‌ళ్లీ ఇలాంటి మిష‌న్స్ చేప‌ట్టేందుకు నాసాకు కాన్ఫిడెన్స్ వ‌చ్చింద‌ని క్ష‌త్రియా పేర్కొన్నారు. వ్యోమ‌గాముల‌తో అంత‌రిక్ష ప్ర‌యాణం చేప‌ట్ట‌డ‌మే పెద్ద ల‌క్ష్య‌మ‌ని, ఆర్టెమిస్‌2 మిష‌న్ ఆ ల‌క్ష్యాన్ని నిజం చేసింద‌ని తెలిపారు. .