* నౌకల్లోనే ఉండండి.. భారత నావికులకు కేంద్రం అడ్వయిజరీ
పశ్చిమాసియా యుద్ధంలో రెండు వారాలు తాత్కాలిక కాల్పుల విరమణతో హర్మూజ్ జలసంధి గుండా రాకపోకలకు ఇక ఏ ఆటంకం ఉండదని భావించిన ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది ఇరాన్. అంత తేలికగా హర్మూజ్‌పై తమ పెత్తనాన్ని వదులుకునేందుకు ఇష్టపడని ఇరాన్ కొన్ని షరతులు విధిస్తోంది. అంతర్జాతీయ రవాణాలో కీలకమైన ఈ జలసంధిని దాటాలంటే కొన్ని నియమాలు వర్తిస్తాయని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(ఐఆర్జీసీ) మెలికి పెడుతుంది.
ఇంతముందులా హర్మూజ్ జలసంధి గుండా నౌకల రవాణా కొనసాగడానికి ఇరాన్ అభ్యంతరం చెబుతోంది. టోల్ వసూలు చేయాలని భావించిన ఇరాన్ తమ ఆధిపత్యాన్ని చెలాయించేందుకు షరతులు విధిస్తోంది. హోర్ముజ్ జలసంధి మీదుగా రవాణాకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని ఐరోపా సమాఖ్య స్పష్టం చేసింది. “అంతర్జాతీయ చట్టాల ప్రకారం, రవాణాకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. ఎలాంటి చెల్లింపుల, టోల్ ఫీజుల వసూలు ఉండకూడదు” అని యూరోపియన్ కమిషన్ ప్రతినిధి తెలిపారు.
ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతున్నందున రోజుకు 15 నౌకలను మాత్రమే హర్మూజ్ సంధి గుండా వెళ్లనిస్తామని తేల్చి చెబుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ నియంత్రణ నియమాలను ఐఆర్జీసీ కనుసన్నల్లో జరుగుతాయి. నౌకల అనుమతికి సంబంధించి ఆయా దేశాలతో ఐఆర్జీసీ అధికారికంగా మాట్లాడుతుంది. యుద్ధానికి ముందులా హర్మూజ్‌ను దాటడం ఇక కుదరదు. యుద్ధం కారణంగా ఇతర దేశాల్లోని ఇరాన్ ఆస్తులను స్తంభింపజేశారు. ఈ రెండు వారాల్లోగా వాటిని తమకు అప్పగించాలి అని ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్రం అత్యవసర అడ్వయిజరీ జారీచేసింది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా నౌకల నుంచి బయటకు రావద్దని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డిజిఎస్) సూచించింది. భద్రతాకారణాల దృష్ట్యా ఇరాన్ దాని పరిసర జలాల్లో చిక్కుకుపోయిన భారత నావికులు సున్నితమైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని పేర్కొంది.

More Stories
మొక్కుబడిగానే ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు?
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై నమ్మకం లేదన్న ఇజ్రాయెల్
అమెరికాతో రక్షణ భాగస్వామ్యం విస్తృతిపై మిస్రీ చర్చలు