రూ.2,534 కోట్లతో అమరావతిలో కేంద్ర ప్రభుత్వం నిర్మాణాలను చేపట్టనుంది. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేసిన సిపిడబ్ల్యూడి, కేంద్ర మంత్రివర్గం ఆమోదానికి పంపింది. అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ (సిసిఎస్) నిర్మాణం కోసం రూ.1,299.08 కోట్లు, నివాస సముదాయాల(జిపిఆర్‌ఎ) ఏర్పాటు కోసం రూ.1,234.91 కోట్లతో కూడిన పిఐబి మెమోరాండం సిద్ధమైంది.
ఈ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగాలంటే కేబినెట్ సెక్రటేరియట్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు క్లియరెన్స్ రావాల్సి ఉంది. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ వెలువడిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఎపి అధికారులు ఇప్పటికే కేబినెట్ సెక్రటేరియట్‌కు సమర్పించారు. వచ్చే కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు అనుమతి లభించే అవకాశం ఉంది. ప్రాజెక్టు తదుపరి అనుమతులకు కీలకమైన కేబినెట్ సెక్రటేరియట్ క్లియరెన్స్ మాత్రమే పెండింగ్ ఉంది.
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఫైల్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు. అమరావతిలో కేంద్ర నిర్మాణాల కోసం మొత్తం 22.53 ఎకరాల భూమిని సిఆర్‌డిఎ కేటాయించింది. సిపిడబ్ల్యూడి కోసం 22.53 ఎకరాల భూమిని ఏపి ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో 5.53 ఎకరాలు సెక్రటేరియట్ నిర్మాణానికి, 17 ఎకరాలు నివాస సముదాయాల(జిపిఆర్‌ఎ) ఏర్పాటుకు కేటాయించారు.
కేబినెట్ సెక్రటేరియట్ నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులు జరిగే అవకాశం ఉంది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్‌లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అమరావతి కేంద్రంగా పని చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మల్టీస్టోరేజ్ నివాస సముదాయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.

More Stories
ఆంధ్ర తీరంలో తమిళనాడు బోట్ల ఆగడాలు
అమరావతే రాజధాని.. చట్టబద్ధ రక్షణ ప్రక్రియ సంపూర్ణం
నౌకాదళంలోకి అణు సామర్ధ్యం గల ఐఎన్ఎస్ అరిదమాన్