* ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ ప్రతినిధుల భేటీ!
ఇరాన్‌పై మంగళవారం అర్ధరాత్రి జరగాల్సిన దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. రెండు వారాల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని తెలిపారు. అయితే ప్రపంచ చమురు రవాణాలో ఎంతో కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణం తెరిస్తేనే ఈ ‘కాల్పుల విరమణ’ అమల్లో ఉంటుందని ఆయన షరతును విధించారు.
ట్రంప్ ప్రతిపాదన పట్ల ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్‌తో చర్చల అనంతరం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై ఈ రాత్రి జరగాల్సిన దాడులను నిలిపివేయాలని వారు చేసిన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు.
హోర్ముజ్ జలసంధిని తక్షణమే తెరవాలన్న షరతుకు లోబడి రెండు వారాల గడువు ఇచ్చేందుకు, కాల్పుల విరమణకు అంగీకరించానని ట్రంప్ తెలిపారు. మరోవంక, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ కూడా ధ్రువీకరించింది. పాక్ మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదురిందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నిర్ధారించిందని మెహర్ న్యూస్ ఏజెన్సీ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది.రాత్రికి రాత్రే ఇరాన్ నాగరికతను అంతం చేస్తానని వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ ఆ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ స్వాగతించారు. ట్రంప్‌నకు ఈ అంశంలో మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని చెప్పారు. కానీ ఆ ఒప్పందంలో లెబనాన్‌ను మినహాయిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇరాన్ అణ్వాయుధాన్ని కానీ, అణు క్షిపణిని కానీ కలిగి ఉండడాన్ని వ్యతిరేకిస్తామని, ఈ అంశంలో అమెరికా నిర్ణయానికి మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. గల్ఫ్ దేశాలకు కూడా ఇరాన్ సమస్య కావొద్దని పేర్కొంటూ తమ లక్ష్యాలను అందుకునేందుకు కలిసి పనిచేయనున్నట్లు అమెరికా తమకు చెప్పినట్లు నెతన్యహూ తెలిపారు.
కాగా, అన్ని వివాదాలను పూర్తిగా పరిష్కరించుకునేందుకు ఒక నిర్ణయాత్మక ఒప్పందం ఇస్లామాబాద్‌లో చర్చలు జరగబోతున్నట్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఏప్రిల్ 10వ తేదీన ఇరాన్, అమెరికా దేశాధినేతలను పాకిస్థాన్‌కు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇరు పక్షాలు అద్భుతమైన వివేకాన్ని, అవగాహనను ప్రదర్శించి శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించే దిశగా నిర్మాణాత్మకంగా కృషి చేశాయని ఆయన అభినందించారు. ఇస్లామాబాద్ చర్చలు సుస్థిర శాంతిని సాధించడంలో విజయం సాధిస్తాయని తాను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే తాము నిర్దేశించుకున్న సైనిక లక్ష్యాలన్నింటినీ చేరుకున్నామని ట్రంప్ తెలిపారు. ఇరాన్ నుంచి తమకు 10 పాయింట్ల ప్రతిపాదన అందిందని, అది చర్చలకు సరైన ప్రాతిపదికగా భావిస్తున్నామని చెప్పారు. గతంలో ఇరు దేశాల మధ్య ఉన్న అనేక వివాదాస్పద అంశాలపై ఒక అంగీకారం కుదిరిందని, ఈ రెండు వారాల విరామం ఆ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు ఇది కీల ముందడుగు కానుందని చెప్పారు.
అమెరికా ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పందిస్తూ దాడులు ఆగిపోతే తాము కూడా తమ రక్షణ కార్యకలాపాలను నిలిపి వేస్తామని ప్రకటించారు. యుద్ధాన్ని ఆపేందుకు కృషి చేసిన పాకిస్థాన్ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా “ఈ ప్రాంతంలో యుద్ధాన్ని ముగించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న నా ప్రియ సోదరులైన పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌లకు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ తరపున నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను” అని తెలిపారు.
ఈ సందర్భంగానే మాట్లాడుతూ అమెరికా పంపిన 15 పాయింట్ల ప్రతిపాదనపై చర్చలకు తాము సిద్ధమని, రెండు వారాల పాటు హార్మూజ్ జలసంధిలో పర్యవేక్షణతో కూడిన రాకపోకలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఇరు దేశాధినేతలు చేసిన ప్రకటనలు చూస్తుంటే ప్రస్తుతానికి పరిస్థితి కొంత సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా ఇరు దేశాల మధ్య కుదిరే తుది ఒప్పందంపైనే యుద్ధం కొనసాగుతుందా లేక ఆగిపోతుందా అనేది ఆధారపడి ఉంది.
More Stories
లవ్ జిహాద్ కేంద్రాలుగా జిమ్నాజియంలు
జీవితంలోనే అత్యుత్తమ ‘సినిమాటిక్ అనుభవం’ ‘ధురందర్ 2’
అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం