కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వ సమర్థించింది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం జరిగిన విచారణలో 9 మంది సభ్యుల ధర్మాసనం విభిన్న కోణాల్లో ఈ అంశాన్ని విచారిస్తున్నది. సుప్రీం ధర్మాసనంలో సీజేఐ సూర్యకాంత్‌తో పాటు జస్టిస్ బీవీ నాగరత్న, ఎంఎం సుందరేశ్, అషానుద్దిన్ అమానుల్లా, అరవింద్ కుమార్, ఆగస్టిన్ జార్జ్ మాసి, ప్రసన్న బి వర్లే, ఆర్ మహాదేవన్, జోయ్మాల్యా బాగ్చీ ఉన్నారు.
10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం లేదన్న అంశంతో పాటు మరికొన్ని అంశాలను సుప్రీంకోర్టు పరిశీలిస్తున్నది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేస్తూ ఆ అంశం మత విశ్వాసాలకు చెందుతుందని, మతం పరిధిలోకి వస్తుందని, జుడిషియల్ పరిధిలోకి ఇది రాదని చెప్పింది.
విచారణ సమయంలో జస్టిస్ బీవీ నాగరత్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఆర్టికల్ 17ని ప్రస్తావించడాన్ని ఆమె వ్యతిరేకించారు. ఓ మహిళగా ఆలోచిస్తే, నెలలో మూడు రోజులు మహిళలను అంటరానివారిగా చూడలేమని, నాలుగో రోజు అస్పృశ్యత లేదని చెప్పడం సరికాదని తెలిపారు. ఆర్టికల్ 17 కేవలం ఆ మూడు రోజులకే ఎలా వర్తిస్తుందని ఆమె ప్రశ్నించారు.
రుతుక్రమ వయసులో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లకూడదన్న నిబంధనపై విచారణ జరుగుతున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ తానేమీ రుతుక్రమ సమస్య గురించి మాట్లాడడం లేదని స్పష్టత ఇవ్వబోయారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం అనేది రుతుక్రమ సమస్యకు సంబంధించినది కాదని, కేవలం వయసు సంబంధిత అంశమే అని తెలిపారు.
2018 నాటి శబరిమల తీర్పును ప్రస్తావిస్తూ 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఆలయ ప్రవేశాన్ని కల్పించకపోవడం ఒకరమైన అంటరానితనమే అవుతుందని ఆ తీర్పులో చెప్పారని గుర్తు చేశారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 17ను ఉల్లంఘించినట్లే అవుతుందని అప్పటి సీజే చంద్రచూడ్ అన్నారని తెలిపారు. అయితే తుషార్ మెహతా చేసిన వ్యాఖ్యలను జస్టిస్ నాగరత్న తప్పుపడుతూ శబరిమల కేసులో ఆర్టికల్ 17 అప్లై అవుతుందంటే అప్పుడు మహిళలను అంటరానివారిగా పరిగణిస్తున్నట్లు అర్థం వస్తుందని, దీని పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
ఏదైనా అశాస్త్రీయ విధానం ఉంటే, దాన్ని శాసనాల ద్వారా పరిష్కరించుకోవచ్చని తుషార్ మెహతా సూచించారు. ప్రతి మతపరమైన విధానాన్ని గౌరవించాలని చెబుతూ ప్రతి అంశాన్ని హుందాతనానికి, శరీర స్వేచ్ఛకు ఆపాదించలేమని పేర్కొన్నారు. మసీదుకు వెళ్లినా, గురుద్వారకు వెళ్లినా ముఖాన్ని కప్పుకోవాల్సి వస్తుందని, అప్పుడు నా గౌరవాన్ని, హక్కును లాక్కున్నారని అనలేమని తుషార్ మెహతా చెప్పారు. మతపరమైన స్వేచ్ఛను రాజ్యాంగం రక్షిస్తుందని చెప్పారు.

More Stories
ఇరాన్‌పై 2 వారాల పాటు దాడుల నిలిపివేత
జీవితంలోనే అత్యుత్తమ ‘సినిమాటిక్ అనుభవం’ ‘ధురందర్ 2’
అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం