కోల్‌కతాపై దాడి చేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ రెండు భాగాలుగా విడిపోయినప్పుడు వారు పర్యవసానాలను అనుభవించారని ఎద్దేవా చేశారు. కాబట్టి ఆయన అలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయకూడదని హితవు చెబుతూ వారు బెంగాల్‌పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్ని భాగాలుగా విడిపోతుందో ఆ దేవుడికే తెలుసని అంటూ హెచ్చరించారు.
“పాకిస్థాన్ రక్షణ మంత్రి అలాంటి రెచ్చగొట్టే ప్రకటన చేసి ఉండకూడదు. 55 ఏళ్ల క్రితం పాకిస్థాన్ రెండు భాగాలుగా విడిపోయినప్పుడు వారు దాని పర్యవసానాలను అనుభవించారు. వారు ఇప్పుడు బెంగాల్‌పై కన్నేస్తే, ఈసారి పాకిస్థాన్ ఎన్ని భాగాలుగా విడిపోతుందో దేవుడికే తెలియాలి” అంటూ చురకలు అంటించారు. ఈ క్రమంలోనే 55 ఏళ్ల క్రితం పాకిస్థాన్ రెండుగా విడిపోయిన విషయాన్ని రాజ్‌నాథ్ ప్రస్తావించారు. 1971లో జరిగిన యుద్ధంలో తూర్పు పాకిస్థాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది.
ఆ సమయంలో బంగ్లాదేశ్‌కు భారత సైన్యం అండగా నిలిచింది. అప్పట్లో పాక్ ఎన్నో పర్యవసానాలు ఎదుర్కొందని రాజ్‌నాథ్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా రెండు పొరుగుదేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచే ప్రకటనలు చేయవద్దని ఇస్లామాబాద్‌ను హెచ్చరించారు. కాగా కొద్ది రోజుల క్రితం భారత్‌పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి నోరుపారేసుకున్నారు. భవిష్యత్తులో భారత్ ఏదైనా దాడులకు పాల్పడితే కోల్‌కతానూ లక్ష్యంగా చేసుకుంటామని పిచ్చి ప్రేలాపనలు చేశారు. ప్రతిదాడులను ఆ ప్రాంతం వరకూ తీసుకెళ్తామంటూ చెప్పుకొచ్చారు.
ఎక్కడైనా కొంతమంది మృతదేహాలను పడేసి వారు ఉగ్రవాదులేనని నమ్మించేలా భారత్ బూటకపు ఆపరేషన్ రూపొందించినట్లు నివేదికలు ఉన్నాయంటూ అక్కసు వెళ్లగక్కారు. అయితే, తన వాదనలకు బలం చేకూర్చేలా ఖవాజా, ఎటువంటి ఆధారాలూ ఇవ్వకపోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా ఇరాన్ యుద్ధాన్ని అవకాశంగా తీసుకొని పొరుగు దేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై ఖవాజా తన అక్కసు వెళ్లగక్కుతూ పహల్గాం ఘటన జరిగి ఏడాది కావస్తున్న నేపథ్యంలో భారత్ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. తమపై జరిగే దాడులను తిప్పికొడతామని ఖవాజా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.

More Stories
పవన్ ఖేడా ఇంటికి అస్సాం పోలీసులు
ఘర్ వాపసీ తర్వాత పిల్లలతో మాజీ మిస్ ఇండియా అదృశ్యం!
సీఈసీపై అభిశంసన నోటీస్ తిరస్కరణ