45 రోజుల పాటు కాల్పుల విర‌మ‌ణ‌ ప్ర‌తిపాదన‌!

45 రోజుల పాటు కాల్పుల విర‌మ‌ణ‌ ప్ర‌తిపాదన‌!

* అమెరికా దాడులు జరుగుతుండగా ప్రత్యక్ష చర్చల్లో పాల్గొనబోమని ఇరాన్ స్ఫష్టం 

ప‌శ్చిమాసియా సంక్షోభాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఈజిప్ట్‌, పాకిస్థాన్‌, ట‌ర్కీ దేశాలు ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ద‌ళాలు చేస్తున్న దాడిని ఆపేందుకు ఓ ప్ర‌తిపాద‌న చేసిన‌ట్లు తెలుస్తోంది. 45 రోజుల పాటు కాల్పుల విర‌మ‌ణ పాటించాల‌ని ప్లాన్‌ను సిద్ధం చేసిన‌ట్లు భావిస్తున్నారు. హోర్ముజ్ జ‌ల‌సంధి రీఓపెనింగ్ అంశంపై ఇరాన్‌, అమెరికా మ‌ధ్య తీవ్ర ఘర్షణ  న‌డుస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే ఆ యుద్ధాన్నీ ఆపాలంటే, 45 రోజ‌ల పాటు కాల్పుల విర‌మ‌ణ పాటించాల‌ని ప‌శ్చిమాసియా అధికారులు వెల్ల‌డించారు. శాశ్వ‌త‌మైన కాల్పుల విర‌మ‌ణ జ‌ర‌గాలంటే, తొలుత ఇరాన్‌, అమెరికా దేశాలు 45 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విర‌మ‌ణ ప్ర‌తిపాద‌న‌కు అంగీకారం తెలుపాల్సి ఉంటుంద‌ని తెలుస్తోంది.  తమతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి గడువును మరో 20 గంటలు (మంగళవారం రాత్రి) వరకు ట్రంప్ పొడిగించారు.

అప్పటికీ ఒప్పందానికి రాకపోతే విధ్వంసకర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధపడాలని ఇరాన్‌కు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరామానికి ప్రాంతీయ మధ్యవర్తులు ఇరాన్, అమెరికాతో చర్చలు జరుపుతుండడం గమనార్హం.   ఇరాన్ ఇంధన కేంద్రాలపై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా జరపనున్న భారీ బాంబు దాడుల కార్యాచరణ ప్రణాళిక అమలుకు సిద్ధంగా ఉందని, అయితే ఒప్పందం కుదుర్చుకోవడానికి చివరి అవకాశం ఇవ్వడమే ట్రంప్ గడువు పొడిగింపు లక్ష్యమని ఓ అమెరికా పత్రిక తన కథనంలో వెల్లడించింది.

ప్రస్తుత సంక్షోభాన్ని తాత్కాలికంగా ముగించి, చర్చలకు మార్గం సుగమం చేయడమే వీటి ఉద్దేశమని పేర్కొన్నాయి. అమెరికా, ఇరాన్‌లు పరస్పర దాడులు చేసుకోకుండా 45 రోజుల పాటు సంమయనం పాటించాలి. ఈ గడువులోగా ఇరు దేశాల ప్రతినిధులు వివాదాస్పద అంశాలపై ముఖాముఖి చర్చలు జరిపి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలి.  ఇరాన్‌, అమెరికా మాత్రం ఇంత వ‌ర‌కు ఈ ప్ర‌తిపాద‌న‌పై ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర‌గాచి, ప‌శ్చిమాసియా దౌత్య‌వేత్త స్టీవ్ విట్‌కాఫ్‌కు కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం ప్ర‌తిపాద‌న అందిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తాత్కాలిక కాల్పుల విర‌మ‌ణ‌కు ఇరాన్‌, అమెరికా అంగీకరిస్తాయా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేదు. 

మధ్యవర్తులు సమర్పించిన కాల్పుల విరమణ ప్రతిపాదనలకు తాము తమ ప్రతిస్పందనను రూపొందించుకున్నామని, అమెరికా, ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేస్తున్నంత కాలం ప్రత్యక్ష చర్చలలో పాల్గొనబోమని ఇరాన్ తేల్చి చెప్పింది.  “యుద్ధ నేరాలకు పాల్పడతామనే హెచ్చరికలు, అల్టిమేటమ్‌లతో చర్చలు పొసగవు” అని  విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి  స్పష్టం చేశారు.  

తమ జాతీయ ప్రయోజనాల ఆధారంగా టెహ్రాన్‌కు కొన్ని ఆవశ్యకతలు ఉన్నాయని, వాటిని ఇప్పటికే మధ్యవర్తి మార్గాల ద్వారా తెలియజేయడం జరిగిందని అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. 15-సూత్రాల ప్రణాళిక వంటి గతంలో అమెరికా చేసిన డిమాండ్లను “అతిగా” ఉన్నాయని తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. అయితే ఆర్థిక నష్టానికి పరిహారం క‌ల్పించే వ‌ర‌కు, మ‌రోసారి దాడి చేయ‌బోమ‌ని హామీ ఇచ్చే వ‌ర‌కు వెనుక‌డుగు వేసేది లేద‌ని ఇరాన్ చెబుతోంది.

ఇక ట్రంప్ మాత్రం త‌న హెచ్చరికల‌ను జారీ చేస్తూనే ఉన్నారు. హోర్ముజ్ నుంచి ఇరాన్ త‌ప్పుకోకుంటే, ఇరానీ బ్రిడ్జ్‌లు, విద్యుత్తు స్టేష‌న్ల‌ను పేల్చివేస్తాన‌ని బెదిరించారు. యాక్సియోస్ వెబ్‌సైట్‌లో తాత్కాలిక కాల్పుల విర‌మ‌ణ ప్ర‌తిపాద‌న‌కు చెందిన స‌మాచారం విడుదలైంది. ప్ర‌తిపాదిత‌ ఒప్పందంపై సోమ‌వారం ఓ ఒప్పందం జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కొన్ని వ‌ర్గాలు చెబుతున్నాయి. రెండు ద‌శ‌ల్లో ఈ ఒప్పందం జ‌ర‌గ‌నున్న‌ది. తొలుతు కాల్పుల విరమణ, ఆ త‌ర్వాత తుది ఒప్పందం ఉంటుంది. కాల్పుల విర‌మ‌ణ స‌మ‌యంలో హోర్ముజ్ జ‌ల‌సంధిని త‌క్ష‌ణ‌మే తెరుస్తారు. 

ఇక ప‌శ్చిమాసియా సంక్షోభంపై మ‌రో 20 రోజుల్లోగా తుది ఒప్పందం కుద‌ర‌నున్న‌ది. పాకిస్థాన్ ఈ దౌత్యంలో కీల‌క పాత్ర పోషిస్తున్న‌ది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్ష‌ల్ అసిమ్ మునీర్‌ ఆదివారం రాత్రి మొత్తం ఈ ఒప్పందం అంశంపై వ‌ర్కౌట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్‌తో పాటు ప్ర‌త్యేక దౌత్య‌వేత్త స్టీవ్ విట్‌కాఫ్‌, ఇరాన్ మంత్రి అబ్బాస్ అర‌గాచిలతో ఆయ‌న సమాలోచనలు జరిపారు.