తారామ‌తిలో బాలీవుడ్ న‌టుడితో పాటు ఓ జంట‌కు పాజిటివ్

తారామ‌తిలో బాలీవుడ్ న‌టుడితో పాటు ఓ జంట‌కు పాజిటివ్
తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వీకెండ్ రాగానే నగర పరిసర ప్రాంతాల్లో మత్తు పార్టీలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలోని తారామతి బారాదరి సమీపంలో నిర్వహించిన ఓ భారీ డ్రగ్ పార్టీని పోలీసులు ఛేదించారు. ‘మోర్ దెన్ ఫ్రెండ్స్’ పేరుతో జరిగిన ఈ ఈవెంట్‌పై ఈగల్ టాస్క్‌ఫోర్స్, హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, గోల్కొండ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి.
శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ సోదాల్లో భారీగా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు అధికారులు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. డ్రగ్స్ వినియోగం జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. మద్యం మత్తులో ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
 
ఈ రిసార్ట్‌లో జరిగిన పార్టీకి దాదాపు 300 మంది వరకు హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో భాగంగా మొత్తం 64 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో ఆరుగురు డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారిలో బాలీవుడ్ నటుడు అబ్దుల్ సర్వర్‌తో పాటు అభినాశ్ ఫణి, యోగేశ్వర్, బ్రెట్ జాసన్, నిహార్-ఆషి అనే భార్యాభర్తలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
 
వీరు గంజాయి, కొకైన్ వంటి మాదకద్రవ్యాలు వినియోగించినట్లు నిర్ధారణ అయింది. డీజే జాసన్ సూచన మేరకు ఈ పార్టీకి హాజరైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ పార్టీకి బెంగళూరు, ఢిల్లీ, ముంబయి వంటి నగరాల నుంచి యువతీ యువకులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు భారీగా హాజరైనట్లు సమాచారం.  స్థానికుల కంటే ఇతర నగరాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 
పార్టీలో డ్రగ్స్ సరఫరా ఎలా జరిగింది? ఎవరు ఈ నెట్‌వర్క్‌కు మాస్టర్‌మైండ్? ఇలాంటి పార్టీలు తరచుగా జరుగుతున్నాయా? అనే కోణాల్లో హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసిన ముఠా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పరారీలో ఉన్న సరఫరాదారులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
 
కాగా, ఆదివారం రాత్రి కొండాపూర్ పబ్‌లో ఏడుగురిని ఈగల్‌ బృందం పట్టుకుంది. వీరు మెథ్, మరిజువానా వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్పాట్ టెస్ట్ కిట్‌లతో పరీక్షలు నిర్వహించి వెంటనే నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. గోవా నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల గుర్తిస్తున్నారు. నిందితులు క్రిప్టో, ఫేక్ యూపీఐలతో చెల్లింపులు చేస్తున్నట్లు గుర్తించారు.