డెల్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఇరాన్

డెల్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఇరాన్

పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి.  అమెరికా-ఇరాన్ ఘర్షణ ఇప్పుడు క్షిపణుల నుంచి గ్లోబల్ టెక్నాలజీ, ఫైనాన్స్ సంస్థల వైపు మళ్లినట్టుగా కనిపిస్తోంది. అమెరికాకు చెందిన 18 ప్రముఖ కంపెనీలు తమ హిట్ లిస్టులో ఉన్నాయని ఐఆర్జీసీ తన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా స్పష్టంచేసింది. 

ఈ ఐటీ సంస్థలన్నీ అమెరికా నిఘా వర్గాలకు సమాచారాన్ని చేరవేస్తున్నాయని ఆరోపించింది. అమెరికా ఆంక్షలు, ఇజ్రాయెల్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం డెల్ ను ‘ఉగ్రవాద సంస్థ’గా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ టెక్ ప్రపంచంలో పెను కలకలం రేపుతోంది. 

ఇరాన్ ప్రకటన వెలువడిన వెంటనే డెల్ కంపెనీ తన ఉద్యోగుల భద్రతపై అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. సంస్థ అంతర్గతంగా జారీ చేసిన ఆదేశాలలో ప్రధానాంశాలు ఇవే: కంపెనీ ఉద్యోగులెవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్‌కు వెళ్లవద్దని ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న లేదా అక్కడి ప్రాజెక్టులతో సంబంధం ఉన్న తమ సిబ్బందిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. 

ఇరాన్ సంస్థలతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు, సాంకేతిక ఒప్పందాలు లేదా సరఫరా గొలుసు  సంబంధాలు పెట్టుకోవద్దని స్పష్టం చేసింది. అదేవిధంగా కంపెనీ డేటా, నెట్‌వర్క్ భద్రతపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని డెల్‌ తన ఐటీ విభాగాలను హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ)   హెచ్చరికలు ఇంతటితో ఆగలేదు. 

డెల్ తర్వాత మరో 18 అమెరికన్ కంపెనీల జాబితాను  తాము సిద్ధం చేశామని, వాటిపై కూడా త్వరలోనే ఇలాంటి కఠిన చర్యలే ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆ దేశంలో అమెరికన్ టెక్నాలజీ వినియోగంపై పూర్తి నిషేధం విధించే అవకాశం ఉంది. ఇది పశ్చిమాసియాలో టెక్నాలజీ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా, అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలను మరింత పెంచనుంది.

కాగా, దుబాయ్ లోని ఒరాకిల్ ప్రధాన కేంద్రంపై ఇరాన్ శనివారం డ్రోన్లతో దాడి చేసింది. దుబాయ్‌లోని షేక్ జయేద్‌రోడ్ హైవేలో ఒరాకిల్ ప్రధాన కేంద్రంపై ఈ దాడి జరిగింది.భవనం శిథిలాలు కూలి స్వల్పంగా కొందరికి గాయాలయ్యాయి. యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి 1900 మంది కన్నా ఎక్కువ మంది ఇరానీయులు మృతి చెందగా, అరబ్ దేశాలు, ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులో రెండు డజన్ల మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఇజ్రాయెల్‌లో 19 మంది, అమెరికా సిబ్బంది 13 మంది మృతి చెందారు. లెబనాన్‌లో 1300 ప్రజలు ప్రాణాలు కోల్పోగా, మిలియన్ మంది నిర్వాసితులయ్యారు. అక్కడ 10 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు.