* 5 కిలోల గ్యాస్ సిలిండర్ కు అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇండియా సహా అనేక దేశాలు చమురు కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. అందుకే భారత్ ఇప్పుడు చమురు కోసం ఏ ఒక్క దేశంపైనో ఆధారపడకుండా, అవకాశం ఉన్న ప్రతీ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. దీనిలో భాగంగా ఆఫ్రికాలోని చిన్న దేశమైన అంగోలా నుంచి కూడా చమురు దిగుమతి చేసుకుంటోంది.
ఇంకా, చెప్పాలంటే ఈ దేశ చమురు మన దేశ అవసరాల్ని చాలా వరకు తీరుస్తుందని చెప్పాలి. కొద్ది రోజుల క్రితం రష్యా నుంచి చమురు కొనుగోలును తగ్గించడంతో భారత్ అంగోలా నుంచి చమురు దిగుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అంగోలా చమురు దిగుమతిని భారీగా పెంచుకుంది. ఇటీవలి కాలంలో అంగోలా నుంచి దాదాపు 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ ఈ ఆయిల్ కొనుగోలు చేసింది. హంగో ఆయిల్ ఫీల్డ్ నుంచి ఒక మిలియన్ బ్యారెల్స్, క్లావ్ క్రూడ్ నుంచి మరో మిలియన్ బ్యారెల్ క్రూడాయిల్‌ను కొనుగోలు చేసింది. ఎక్సాన్‌మొబిల్ సంస్థ వీటిని నిర్వహిస్తుంది. ఈ సంస్థ వెలికితీసే చమురు ఆసియన్ రిఫైనరీల ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ క్రూడాయిల్ ప్రాసెస్ చేస్తే పెట్రోల్, డీజిల్ అధికంగా ఉత్పత్తి అవుతుంది.
నైజీరియా తర్వాత ఆఫ్రికాలో చమురు ఉత్పత్తి చేసే రెండో పెద్ద దేశం అంగోలా. ప్రతి రోజూ 1.1 మిలియన్ బ్యారెళ్ల చమురును ఈ దేశం ఉత్పత్తి చేస్తుంది. ఈ దేశంలో 7.78 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు కలిగి ఉంది. దీంతో ఇటీవలి కాలంలో ఇండియాకు భారీ మొత్తంలో చమురు అందిస్తోంది. మరోవంక, ఇకపై 5 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ను అడ్రస్ ప్రూఫ్ అవసరం లేకుండా కేవలం ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి కొనుగోలు చేయవచ్చని స్పష్టంచేసింది. సమీపంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని పెట్రోలియం శాఖ తెలిపింది.
అదేవిధంగా దేశంలో పెట్రోల్, డీజిల్ లేదా ఎల్పీజీకి ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రజలు ఆందోళనచెంది ఇంధనాన్ని అధికంగా కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ ఔట్‌లెట్లు సాధారణంగా పనిచేస్తున్నాయని, తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. ముఖ్యంగా వలస కార్మికులు, స్థానిక చిరునామా పత్రాలులేని వారిని దృష్టిలో ఉంచుకుని 5 కేజీల సిలిండర్ నిబంధనను సరళతరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 23 నుంచి ఇప్పటివరకు సుమారు 5.7 లక్షల సిలిండర్లను అడ్రస్ ప్రూఫ్ నిబంధన లేకుండా విక్రయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

More Stories
పాక్ ను వెంటనే 3.5 బిలియన్ డాలర్ల అప్పు తీర్చమన్న యూఏఈ
విదేశీ ఔషధాలపై ట్రంప్ 100 శాతం దిగుమతి సుంకాలు
భారత్‌కు మరింత చమురు, గ్యాస్.. రష్యా హామీ