కేరళంలో ‘డబుల్ ఇంజన్’ సర్కార్‌తోనే సమగ్ర అభివృద్ధి

కేరళంలో ‘డబుల్ ఇంజన్’ సర్కార్‌తోనే సమగ్ర అభివృద్ధి
కేరళం రాష్ట్ర పురోభివృద్ధి కేవలం ఎన్డీఏ ప్రభుత్వం ద్వారానే సాధ్యమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. కేరళం ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన వివిధ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి, ఎన్డీఏ అభ్యర్థుల విజయానికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.  ఆదివారం ఎర్నాకులం జిల్లా కోలెంచేరిలో జరగనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ బహిరంగ సభ ఏర్పాట్లను శ్రీనివాస వర్మ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
సభా ప్రాంగణాన్ని సందర్శించి, భద్రత, జన సమీకరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభను విజయవంతం చేయాలని ఎన్డీఏ శ్రేణులకు పిలుపునిచ్చారు.  అంతకు ముందు అలువా నియోజకవర్గ పర్యటనలో భాగంగా సెయింట్ థామస్ కాపుచిన్ ప్రొవిన్షియలేట్ క్రైస్తవ మతగురువులతో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ , కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే, సమావేశమై కేరళ అభివృద్ధి, సామాజిక అంశాలపై చర్చించి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు. 
అనంతరం అలువాలోని ఎడతల ప్రాంతంలో పర్యటించి ఎన్డీఏ అభ్యర్థి ఎం.ఏ. బ్రహ్మరాజ్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేశారు.  కొడంగల్లూరు నియోజకవర్గంలోని వెస్ట్ కొరట్టిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎన్డీఏ అభ్యర్థి డాక్టర్ వర్గీస్ జార్జ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుత ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కేరళంలోని ప్రతి ఇంటికీ అందాలంటే రాష్ట్రంలో ‘డబుల్ ఇంజన్’ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
 
కేరళంలో కమ్యూనిస్టుల కోటలు ఈసారి బద్ధలు కావడం ఖాయం అని ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. కేరళం అభివృద్ధికి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.