మామిడి ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు?

మామిడి ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు?

* పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరిక 

ఈ వేసవిలో నిగనిగలాడుతూ కనిపించే మామిడి ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న వాస్తవాన్ని మర్చిపోవద్దని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. కొందరు స్వార్థపరులైన వ్యాపారులు డబ్బుల కక్కుర్తి కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  సహజ రీతిలో పక్వానికి రావాల్సిన మామిడిని కాల్షియం కార్బైడ్‌ వంటి కెమికల్స్ వినియోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారని సజ్జనార్‌ వెల్లడించారు.

రోడ్డు పక్కన బండ్లపై నిగనిగలాడుతూ, బంగారపు రంగులో కంటికి అత్యంత ఆకర్షణీయంగా కనిపించే ప్రతి పండూ నాణ్యమైనదే అనుకొని కొనడమంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమేనంటూ సోషల్​ మీడియా ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. సాధారణంగా సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదని సీపీ సజ్జనార్ అన్నారు. కానీ రసాయనాలతో మగ్గించిన పండ్ల పైన పసుపు పచ్చగా ఉండి, లోపల మాత్రం పచ్చిగా ఉండి విషతుల్యంగా మారుతాయని ఆయన చెప్పారు.

ఇలాంటి పండ్లను తినడం వల్ల గొంతు దగ్గర మంట, వాంతులు, విరేచనాలు, కడుపులో వికారం వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు.  ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ వ్యాపారుల పట్ల హైదరాబాద్ పోలీస్ విభాగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతోందని సజ్జనార్ స్పష్టం చేశారు.

కల్తీ మామిడి పండ్లపైనా హెచ్‌-ఫాస్ట్ (హైదరాబాద్‌ ఫుడ్‌ అడల్టరేషన్‌ సర్వైలెన్స్‌ టీమ్‌) పటిష్టమైన నిఘా ఉంచుతోందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.  ప్రజలు రూపాన్ని చూసి మోసపోకుండా, సహజత్వాన్ని గుర్తించి పండ్లను కొనుగోలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. సహజంగా పండిన పండ్ల కంటే అసహజమైన రంగు, రసాయన వాసన, వింత రుచి కలిగిన మామిడి పండ్ల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

పండ్లపై అసాధారణ మచ్చలున్నా లేదా బేకింగ్ సోడా నీటిలో కడిగినప్పుడు రంగు మారినా అవి ఆరోగ్యానికి చాలా హానికరమని గ్రహించాలని సూచించారు.  కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ ఫోన్ నంబ‌ర్ 8712661212కు స‌మాచారం ఇవ్వాలని సజ్జనార్‌ పోస్ట్​లో విజ్ఞప్తి చేశారు.

కాగా, హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లోని గోదాంలో హెచ్ ఫాస్ట్ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. మామిడిపళ్లను హానికర రసాయనాలతో మక్కపెడుతున్న వ్యాపారి గోదాంలో సుమారు 7 టన్నుల మామిడిపండ్లు స్వాధీనం చేసుకున్నారు. గోదాం నిర్వాహకులు జమీల్, ఫరీద్‌పై కేసు నమోదు చేసి గోదాంను సీజ్‌ చేశారు.