విదేశీ ఔషధాలపై ట్రంప్ 100 శాతం దిగుమతి సుంకాలు

విదేశీ ఔషధాలపై ట్రంప్ 100 శాతం దిగుమతి సుంకాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విదేశీ పేటెంట్‌ ఔషధాలపై ఏకంగా 100 శాతం దిగుమతి సుంకాలు విధించాలని నిర్ణయించారు. దీంతో పేటెంట్‌ కలిగిన స్పెషాలిటీ డ్రగ్స్‌, కీలకమైన ఔషధ ముడి పదార్థాలను ఎగుమతి చేసే భారతీయ కంపెనీలపై ఈ భారం తక్షణమే పడనుంది. 
 
అమెరికా మార్కెట్‌పై భారీగా ఆధారపడిన ఫార్మా కంపెనీలు అక్కడ తమ తయారీ కేంద్రాలను నెలకొల్పాలని లేకపోతే భారీ పన్నులు చెల్లించాలనే ట్రంప్‌ నిబంధనలు అంతర్జాతీయ ఫార్మా వాణిజ్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలైన ఐర్లాండ్‌, జర్మనీలకు కొంత పన్ను మినహాయింపు లభించినా, భారత్‌ వంటి దేశాల పేటెంట్‌ ఉత్పత్తులకు ఈ వెసులుబాటు లేకపోవడం ఇక్కడి కంపెనీల పోటీతత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఫార్మా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తోన్నాయి. 
 
భారత్‌ నుండి అమెరికాకు వెళ్లే ఔషధ ఎగుమతుల్లో 90 శాతం వరకు చౌకగా లభించే జెనరిక్‌ మందులపై ఈ ముప్పు ఉండదని ఆ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ ప్రస్తుతం మినహాయింపు పొందిన జెనరిక్‌ మందుల భవిష్యత్తుపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మినహాయింపు కేవలం ఏడాది కాలానికేనని, ఆ తర్వాత అమెరికా వాణిజ్య శాఖ దీనిని పునఃపరిశీలిస్తుందని ప్రకటించడం భారత ఫార్మా రంగానికి పెద్ద హెచ్చరికగా మారింది.

ఇప్పటికే దేశీయంగా పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, సరఫరా గొలుసులో ఇబ్బందులతో సతమతమవుతున్న ఇక్కడి కంపెనీలకు అమెరికాలో అదనపు సుంకాలు తోడైతే లాభదాయకత భారీగా పడిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ఏడాది తర్వాత జెనరిక్‌ మందులపై కూడా ఆంక్షలు విధిస్తే అది భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా అక్కడి సామాన్యుడికి అందే చౌక వైద్యంపై ట్రంప్‌ నిర్ణయాలు గొడ్డలిపెట్టుగా మారనున్నాయి.
 
ట్రంప్‌ నిర్ణయాల వల్ల భారత పారిశ్రామిక వృద్దికి, ఉద్యోగ అవకాశాలకు ఆటంకంగా మారే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో అమెరికాతో జరిగే వాణిజ్య చర్చల్లో భారత్‌ ఈ సుంకాల నుండి శాశ్వత మినహాయింపు పొందగలిగితేనే ఫార్మా రంగం తన పట్టును నిలబెట్టుకోగలదని అభిప్రాయపడుతున్నారు.