ఇరాన్‌ నుంచి భారత్‌కు వస్తున్న నౌక చైనాకు మళ్లింపు!

ఇరాన్‌ నుంచి భారత్‌కు వస్తున్న నౌక చైనాకు మళ్లింపు!

ఇరాన్‌ ముడి చమురుతో భారత్‌కు వస్తున్న ట్యాంకర్ అనూహ్యంగా తన గమ్యస్థానాన్ని మార్చుకుంది. మార్చి 4న ఇరాన్‌లోని ఖర్గ్ ద్వీపం నుంచి గుజరాత్‌లోని వడినార్ పోర్టుకు బయలుదేరిన ‘పింగ్‌ షున్‌’ ట్యాంకర్ చైనావైపు వెళ్తున్నట్లు నౌకల ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ కెప్లర్‌ వెల్లడించింది. ఈ నౌక ఏప్రిల్ 4 నాటికి వడినార్‌ ఓడ రేవుకి చేరుకోవాల్సి ఉంది.  కానీ, ఇది చైనాలోని డోగియింగ్‌ దిశగా వెళుతున్నట్లు సంకేతాలు చూపిస్తున్నట్లు కెప్లర్ తెలిపింది.

అయితే, ట్యాంకర్ తన గమ్యస్థానానికి వెళ్లే మార్గాలను మార్చుకునే అవకాశం కూడా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక పరమైన అంశాలే కారణమై ఉంటాయని నిపుణుల ప్రాథమిక అంచనా.  యుద్ధం ప్రారంభమైన నాలుగు రోజుల తర్వాత మార్చి 4న ఖర్గ్‌ దీవిలో ఆయిల్ లోడింగ్‌ చేశారని.. ఇందులో దాదాపు 6 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ ఉండొచ్చని కెప్లర్‌ పేర్కొంది. ఈ తరుణంలో ట్యాంకర్ నౌక అనూహ్యంగా చైనా వైపు రూటు మార్చుకోవడం గమనార్హం. 

ఒకప్పుడు భారత చమురు దిగుమతుల్లో ఇరాన్ వాటా దాదాపు 11.5 శాతంగా ఉండేది. 2018లో రోజుకు సుమారు 5.18 లక్షల బ్యారెళ్ల చమురును ఇరాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకోగా, అమెరికా ఆంక్షల కారణంగా భారీగా పడిపోయింది. మే 2019 నాటికి 2,68,000 బ్యారెళ్లకు తగ్గగా, ఆ తర్వాత ఇరాన్ దగ్గర్నుచి చమురు కొనుగోలు చేయడం పూర్తిగా మానేశాం.

పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకున్న పరిస్థితులతో చమురు ధరలు భారీగా పెరిగి అంతర్జాతీయ మార్కెట్‌లో సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో ధరలను తగ్గించాలనే ఉద్దేశంతో ఇరాన్ లో ఆయిల్ కొనుగోలుపై ఆంక్షలను 30 రోజులపాటు తాత్కాలికంగా అమెరికా సడలించింది. దీంతో 2019 తర్వాత తొలిసారి ఇరాన్‌ క్రూడాయిల్ నౌక భారత్‌‌కు బయల్దేరినట్లు డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ కెప్లర్‌ ఇటీవల తెలిపింది.

భారత్ రావాల్సిన నౌక ఇప్పుడు అకస్మాత్తుగా వేరే దేశానికి వెళ్లడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. చమురు నౌకకు చేయాల్సిన చెల్లింపుల నిబంధనల్లో మార్పుల కారణంగానే ఈ నౌక చైనా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఒక చమురు నౌకకు 30-60 రోజుల వరకు చెల్లింపులకు అవకాశం ఉండేది. అయితే, ఇప్పుడు కొంత ముందుగానే చెల్లించాలని కోరడం వంటి నిబంధనల కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు.