53 ఏళ్ల తర్వాత చంద్రుడి వద్దకు మళ్ళీ మానవుడు

53 ఏళ్ల తర్వాత చంద్రుడి వద్దకు మళ్ళీ మానవుడు

53 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మానవుడు మళ్లీ చంద్రుడి వద్దకు పయనమయ్యాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రమండల యాత్ర ‘ఆర్టెమిస్‌-2’ దిగ్విజయంగా ప్రారంభమైంది. గురువారం తెల్లవారుజామున 4.06 నిమిషాలకు ఈ ప్రయోగం మొదలైంది.  ఈ ప్రాజెక్టులో భాగంగా నలుగురు వ్యోమగాములు చంద్రుడి సమీపానికి వెళ్లి పరిశోధనలు చేయనున్నారు.

నలుగురు వ్యోమగాముల బందం చంద్రుని చుట్టూ పది రోజుల పాటు ప్రయాణించి, అంతరిక్ష చరిత్రలో సరికొత్త రికార్డులను సష్టించబోతోంది. ఆర్టెమిస్‌-2 అనేది ఒక ప్రయోగం మాత్రమే కాదు. చంద్రునిపై శాశ్వత మానవ ఉనికిని ఏర్పాటు చేసే ‘ఆర్టెమిస్‌ ప్రోగ్రామ్‌’లో అత్యంత కీలకమైనది. చంద్రుని ఉపరితలంపై మనుషులను దించడానికి ముందు చేసే కీలక పరీక్షలాంటింది. వాస్తవానికి ఈ ప్రయోగం ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి షెడ్యూల్‌ ప్రకారం సాయంత్రం 6:24 గంటలకు జరగాల్సి ఉంది. 

అయితే కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నాసా సాంకేతిక బందాలు సత్వరమే స్పందించి సమస్యను పరిష్కరించడంతో ప్రయోగం సజావుగా సాగింది. ఈ పది రోజుల యాత్రలో వ్యోమగాములు కీలక పరిశోధనలను చేయనున్నారు. భూమి నుంచి సుమారు 4 లక్షల కిలోమీటర్ల అవతలికి వీరు వెళ్లే అవకాశం ఉంది. 

నలుగురు వ్యోమగాముల్లో ఒకరు మహిళ కాగా మరొకరు నల్ల జాతీయుడు. ఆర్టెమిస్‌-2 ప్రాజెక్టులో రీడ్ వైజ్‌మాన్ మిష‌న్ క‌మాండ‌ర్‌గా ఉన్నారు. ఆయ‌న మాజీ అమెరికా నేవీ పైలెట్‌. 2009లో నాసా ఆస్ట్రోనాట్ అయ్యారు. 2014లో సుమారు 165 రోజుల పాటు అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రంలో గ‌డిపారు. ఇక ప్ర‌స్తుతం ఆర్టెమిస్ షిప్‌కు పైల‌ట్‌గా విక్ట‌ర్ గ్లోవ‌ర్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఆయ‌న న‌వంబ‌ర్ 2020 నుంచి మే 2021 వ‌ర‌కు స్పేస్ స్టేష‌న్‌లో ఉన్నారు. స్పేస్ఎక్స్ క్రూ-1లో పైలెట్‌గా చేశారు. మూన్ మిష‌న్‌లో పాల్గొన్న తొలి న‌ల్ల‌జాతి ఆస్ట్రోనాట్‌గా ఆయ‌న నిలుచారు. మిష‌న్ స్పెష‌లిస్టుగా క్రిస్టినా కోచ్ ఉన్నారు. అంత‌రిక్షంలో 328 రోజులు గ‌డిపిన మ‌హిళ‌గా ఆమెకు రికార్డు ఉన్న‌ది. 2013లో ఆమె ఆస్ట్రోనాట్ అయ్యారు. చంద్రుడి వ‌ద్దకు ప్ర‌యాణిస్తున్న తొలి మ‌హిళ ఆమె కానున్న‌ది. ఈ మిష‌న్‌లో మ‌రో స్పెష‌లిస్టుగా జెర్మీ హ‌న్సెన్ ఉన్నారు. చంద్రుడి వ‌ద్ద‌కు వెళ్తున్న తొలి కెన‌డా వ్య‌క్తిగా రికార్డు క్రియేట్ చేశారు. 

వ్యోమగాముల ప్రాణాలను రక్షించే లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్స్‌, కమ్యూనికేషన్‌, నావిగేషన్‌ వ్యవస్థలు చంద్రుని వద్ద ఎలా పనిచేస్తాయో వీరు పరిశీలించనున్నారు. ఈ మిషన్‌ విజయవంతమైతే, ‘ఆర్టెమిస్‌ -3’ ద్వారా చంద్రునిపై మనుషులను నేరుగా దించే ప్రక్రియ మరింత సులభతరం కానుంది. 1972లో అపోలో-17 తర్వాత, మళ్లీ ఇప్పుడు మానవ మేధస్సు చంద్రుడిని తాకేందుకు సిద్ధమైంది. భవిష్యత్‌ పరిశోధనలు, ప్రయోగాలలకు ఇది కీలకం కానున్నది.