* నియోజకవర్గ పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల చట్టసవరణ బిల్లుపై చర్చ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 16 నుంచి 18 వరకు జరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు ఆమోదం కోసం ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గురువారంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియాల్సి ఉంది. ఐతే సభలను నిరవధికంగా వాయిదా వేయకుండా ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాల నిమిత్తం ఈ నెల 16న సభను తిరిగి ప్రారంభించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కోరినట్లు స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. సభ తిరిగి ప్రారంభమైనప్పుడు ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ ఉండవని స్పీకర్ స్పష్టం చేశారు. లోక్ సభ స్థానాలను 543 నుంచి 816కు పెంచి, అందులో 273 స్థానాలు మహిళలకు రిజర్వు చేసే విధంగా బిల్లులో మార్పులు చేయనున్నట్లు సమాచారం.
దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత వారం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతోపాటు కాంగ్రెసేతర విపక్ష నేతలతోనూ చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖమంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్‌ల నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. అయితే లోక్ సభ స్థానాల పెంపు విషయంపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో పాటు తృణముల్ కాంగ్రెస్ తో కేంద్రం మాట్లాడాల్సి ఉంది.
సభ శుక్రవారం సమావేశమవుతుందా, గురువారమే నిరవధికంగా వాయిదా పడుతుందా, లేక తదుపరి తెలియజేసే తేదీ వరకు వాయిదా పడుతుందా అని రాజ్యసభలో కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ సంకేతం ఇచ్ఛారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రిజిజు సంకేతాలిచ్చారు.
“మా వద్ద కొన్ని బిల్లులు, కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వీటిని మేము ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులతో కూడా పంచుకున్నాము. రాబోయే రెండు మూడు వారాల వ్యవధిలో మేము ఒక అత్యంత కీలకమైన బిల్లును ప్రవేశపెట్టబోతున్నాము. కాబట్టి ఈ రోజు, సభను వాయిదా వేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. ఆ తర్వాత, ఒక నిర్దిష్ట కాల వ్యవధి కోసం మేము త్వరలోనే తిరిగి సమావేశమవుతాము. ఆ సమావేశం ఉద్దేశం ఏమిటనేది సభ్యులకు ఇప్పటికే తెలిసిందే,” అని రిజిజు తెలిపారు.

More Stories
ఆప్ రాజ్యసభ ఉప నేతగా రాఘవ్ చద్దా తొలగింపు
న్యాయాధికారులనే నిర్బంధిస్తారా? బెంగాల్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం
యుద్ధ ప్రభావం ప్రజలపై పడకుండా చూడాలి