రైల్వేలలో ఆదాయంలో, లోడింగ్‌లో 5వ స్థానంలో వాల్తేరు డివిజన్‌

రైల్వేలలో ఆదాయంలో, లోడింగ్‌లో 5వ స్థానంలో వాల్తేరు డివిజన్‌

వాల్తేరు డివిజన్‌ భారతీయ రైల్వేలలో ఆదాయంలో, లోడింగ్‌లో 5వ స్థానం సాధించిందని, అలాగే రూ.1,600 కోట్ల ఇన్‌క్రిమెంటల్‌ ట్రాఫిక్‌ వృద్ధితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని  డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (డిఆర్‌ఎం) లలిత్‌ బొహ్ర తెలిపారు. వాల్తేరు డివిజన్‌ చరిత్రలో తొలిసారిగా 85.1 మిలియన్‌ టన్నుల సరుకు లోడింగ్‌ సాధించి, గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 17.25% వృద్ధి నమోదు చేసింది. 

అలాగే లోడింగ్‌, అన్‌లోడింగ్‌ కలిపి 150 మిలియన్‌ టన్నుల సరుకు నిర్వహణ కూడా రికార్డు స్థాయిలో నమోదైందని డివిజన్‌ మొత్తం రూ.10,422.56 కోట్ల ఆదాయం సంపాదించి, గత సంవత్సరంతో పోల్చితే 18.75% వృద్ధి సాధించింది. ప్రయాణికుల సంఖ్య 33.42 మిలియన్లకు చేరుకుని 6.6% పెరుగుదల నమోదు కాగా, ప్రయాణికుల ఆదాయం రూ.881.37 కోట్లుగా నమోదై గత 21 సంవత్సరాల్లో అత్యధికంగా నిలిచింది.

మొత్తం డివిజన్‌ ఆదాయం రూ.11,598.07 కోట్లుగా నమోదై, ఇది గత సంవత్సరం కంటే 17% అధికమని తెలిపారు.   విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు ప్లాటినం గ్రీన్‌ రైల్వే స్టేషన్‌ సర్టిఫికేషన్‌ లభించింది. అలాగే ఈఎల్‌ఎస్‌ విశాఖపట్నం బీఎల్‌డబ్ల్యూ ”బ్యూటీ కాంటెస్ట్‌”లో జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. డివిజన్‌కు ఓవరాల్‌ ఎఫిషియెన్సీ షీల్డ్తో పాటు 14 విభాగాల్లో ఉత్తమ ప్రతిభా పురస్కారాలు లభించాయి. 

అదనంగా, 17 మంది ఉద్యోగులు విశిష్ట రైల్‌ సేవా పురస్కార్‌-2025, 54 మంది రైల్‌ సేవా పురస్కార్‌ అందుకున్నారు. 2026- 27 రైల్వే బడ్జెట్‌లో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌కు రూ.10,134 కోట్లు, ఒడిశాకు రూ.10,928 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌కు రూ.7,470 కోట్లు కేటాయించగా, విశాఖలో కొత్త రైల్వే అధికారుల నివాస సముదాయం ప్రారంభించడంతో పాటు, బబ్బిలిలో కొత్త ఆర్పీఎఫ్‌ అవుట్‌పోస్ట్‌ ఏర్పాటు చేశారు. 

అలాగే అదనపు లైన్లు, ఫ్లైఓవర్లు, స్టేషన్‌ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద 15 స్టేషన్లు ఎంపికయ్యాయని తెలిపారు.  విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఏఐ ఆధారిత ”ఎ ఎస్ సి అర్జున్‌” రోబోకాప్‌ ప్రవేశపెట్టారు. ఇది ప్రయాణికుల భద్రతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. 

ప్రయాణికుల అభ్యర్థన మేరకు విశాఖపట్నుం- బెంగళూరు మధ్య వందే భారత్‌ రైలు ప్రతిపాదన పరిశీలనలో ఉందని చెప్పారు. సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం వాల్తేరు పరిధిలో 7 అమృత్ భారత్‌ రైళ్లు అందుబాటులో ఉన్నాయని, రద్దీని దృష్టిలో ఉంచుకుని సాధారణ రైళ్లలో జనరల్‌ బోగీల సంఖ్యను అవసరాన్ని బట్టి పెంచుతున్నామని ఆయన వివరించారు.