చత్తీస్‌గఢ్ ఇప్పుడు నక్సల్స్ రహిత రాష్ట్రమని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సహాయ్ ప్రకటించారు. కేంద్రం విధించిన గడువు మార్చి 31కి అనుగుణంగా చర్యలు చేపట్టామని, తద్వారా లక్షంగా చేరుకున్నామని తెలిపారు. మంగళవారంనాడు జరిగిన ఓ కార్యక్రమంలో విష్ణుదేవ్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చారిత్రత్మక రోజని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ నక్సల్స్‌తో వేదిక పంచుకున్నారని గుర్తు చేస్తూ ఇప్పుడు ఆయన పార్టీ తమపై విమర్శలు గుప్పించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
వామపక్ష తీవ్రవాదంపై పోరులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు 3కోట్ల మంది ఈ రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు చెప్పారు. అభివృద్ధికి తీవ్రవాదం ఇన్నాళ్లూ ఆటంకం మారిందని పేర్కొంటూ మావోయిస్టలకు గత 40 సంవత్సరాలుగా పెట్టనికోటగా మారిన బస్తర్ ఇప్పుడు పూర్తిగా బయటి ప్రపంచంతో మమేకం కాబోతోందని, తద్వారా పురోభివృద్ధికి బాటలు పడతాయని విష్ణుదేవ్ తెలిపారు.
“భయరహిత బస్తర్, నక్సల్ రహిత ఛత్తీస్‌గఢ్. ఒకప్పుడు తుపాకీ కాల్పుల ప్రతిధ్వనులు వినిపించిన చోట, ఈ రోజు అభివృద్ధి, విశ్వాసం, సుపరిపాలన అనే కొత్త ప్రవాహం ప్రవహిస్తోంది. భయం నీడ నుంచి బయటపడి, బస్తర్ ఇప్పుడు ఆత్మవిశ్వాసం, ప్రగతి మార్గంలో అచంచలమైన సంకల్పంతో ముందుకు సాగుతోంది,” అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మంగళవారంనాడు, మొత్తం రూ. 84 లక్షల రివార్డ్ కలిగిన 26 మందితో సహా, మొత్తం 34 మంది నిషేధిత మావోయిస్టులు తమ ఆయుధాలను అప్పగించి లొంగిపోయారని బీజాపూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జితేంద్ర యాదవ్ తెలిపారు. లొంగిపోయిన వారిలో, నిషేధిత సంస్థకు చెందిన దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు విభాగాలకు చెందిన సభ్యులు ఉన్నారు.
వారి నుండి రూ. 3 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 26 మందిపై ఒక్కొక్కరికి రూ.1 లక్ష నుండి రూ. 8 లక్షల వరకు పారితోషికాలు ఉన్నాయి. జనవరి 1, 2024 నుండి ఇప్పటివరకు, బీజాపూర్ జిల్లాలో 824 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారని, 1079 మంది అరెస్టు అయ్యారని, వివిధ ఎన్కౌంటర్లలో 220 మంది మరణించారని యాదవ్ పేర్కొన్నారు.
“మరో మావోయిస్టు డంప్ స్థావరం నుండి 7.2 కిలోల బంగారం (దీని విలువ సుమారు రూ.11.16 కోట్లు) స్వాధీనం కావడంతో, ఇప్పుడు ఒక కొత్త మైలురాయి నెలకొంది. ఈ మిషన్‌లో అత్యంత కీలకమైన నేటి రోజున, ఈ స్వాధీనాన్ని ప్రదర్శిస్తున్నాము,” అని ఆ అధికారి తెలిపారు.

More Stories
హింస మరింత సంఘర్షణకే దారితీస్తుంది.. దలైలామా హెచ్చరిక
బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్
బంగ్లాదేశీయులను తరిమేస్తాం… లవ్ జిహాద్ పై చట్టం తెస్తాం