ఇరాన్‌‌పై అణుదాడికి సన్నాహాలు.. ఐరాస దౌత్యవేత్త రాజీనామా

ఇరాన్‌‌పై అణుదాడికి సన్నాహాలు.. ఐరాస దౌత్యవేత్త రాజీనామా
ఇరాన్‌పై అణ్వస్ర్తాల వినియోగానికి ఐక్యరాజ్యసమితి ప్రయత్నిస్తున్నదని  ఐక్యరాజ్యసమితిలో సుదీర్ఘకాలం సేవలందించిన దౌత్యవేత్త మొహమ్మద్ సఫా ఆరోపిస్తూ తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఈ మేరకు ఆయన ఎక్స్ లో చేసిన పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతుంది.  ఐరాసలోని కొందరు ఉన్నతస్థాయి అధికారులు ఓ శక్తివంతమైన లాబీయింగ్‌కు తొత్తులుగా మారి, తెరవ వెనుక నుంచి ఇరాన్‌పై అణ్వాయుధ దాడులకు సన్నాహాలు చేస్తున్నారని సఫా ఆరోపించారు. 

పేట్రియాటిక్ విజన్ సంస్థ తరఫున ఐరాస ఆర్థిక-సామాజిక మండలిలో శాశ్వత రాయబారిగా మొహమ్మద్ సఫా సేవలందించారు.  ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ ప్రకారం సఫా 2013 నుంచి పేట్రియాటిక్ విజన్ ఆర్గనైజేషన్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. 2016లో ఐక్యరాజ్యసమితికి తమ శాశ్వత ప్రతినిధిగా ఉండేందుకు పీవీఏ ఆయనను నామినేట్ చేసింది.

ఎక్స్‌‌లో రాజీనామా లేఖను పోస్ట్ చేసిన ఆయన చాలా ఆలోచించిన తర్వాతే తాను ఈ నిర్ణయానికి వచ్చానని తెలిపారు. ‘‘ఇరాన్‌పై అణ్వాయుధాల వాడకానికి ఐక్యరాజ్యసమితి సిద్ధమవుతున్న తరుణంలో పరిస్థితి తీవ్రతను వారు అర్థం చేసుకోలేకపోతున్నారని నేను భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. 

‘‘ఇది టెహ్రాన్ చిత్రం.. అది ఎడారి కాదు.. అక్కడ కోటి మంది ప్రజలు ఉన్నారు.. కుటుంబాలు, పిల్లలు కలలు ఉన్న సామాన్యులు అక్కడ ఉన్నారు.. అలాంటి నగరంపై బాంబులు వేయాలనే యుద్దోన్మాదులు మానసిక రోగిష్ఠిలు’’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రహస్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికే తాను దౌత్య పదవికి రాజీనామా చేసినట్టు సఫా వెల్లడించారు.

“అణు ముప్పును నివారించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ నేరానికి సాక్షిగా ఉండకూడదనే నేను పదవి నుంచి తప్పుకుంటున్నాను”  అని ఆయన తెలిపారు. అణ్వాయుధాలతో వాషింగ్టన్, బెర్లిన్, పారిస్, లండన్ లేదా అంతకు మించిన నగరాలపై దాడిని ఊహించుకోండని ఆయన కోరారు. అమెరికా ‘నో కింగ్స్’ అనే నినాదంతో దాదాపు కోటి మంది ప్రజలు నిరసన తెలిపిన సంఘటనలను కూడా సఫా ప్రస్తావించారు.

అణ్వాయుధాల వినియోగం ప్రమాదకరం కాబట్టి దానిని చాలా తీవ్రంగా పరిగణించాలని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఇప్పుడే చర్యలు తీసుకోండి. ఈ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి. వీధుల్లోకి రండి. మన మానవత్వం, భవిష్యత్తు కోసం నిరసన తెలపండి. ప్రజలు మాత్రమే దీనిని ఆపగలరు. చరిత్ర మనల్ని గుర్తుంచుకుంటుంది’’ అని ఆయన పిలుపునిచ్చారు.

తాను 2023లోనే రాజీనామా చేయాలనుకున్నానని, అందుకోసం మూడేళ్లుగా ఓపిక పట్టానని సఫా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంఘర్షణలను ఆయన ప్రస్తావిస్తూ ఐరాసలోని కొందరు అధికారులు ఇజ్రాయెల్, అమెరికాలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని చెప్పడానికి ఇష్టపడటం లేదని సఫా విమర్శించారు.