2.37 లక్షలకు పైగా ఓటర్లకు ఇంటి వద్దే ఓటు సౌకర్యం

2.37 లక్షలకు పైగా ఓటర్లకు ఇంటి వద్దే ఓటు సౌకర్యం

త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు ఉప ఎన్నికల్లో కలిపి సుమారు 2.37 లక్షలకు పైగా ఓటర్లు ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యాన్ని వినియోగించుకోనున్నట్లు భారత ఎన్నికల సంఘం  వెల్లడించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 60(సి) ప్రకారం 85 ఏళ్లు దాటిన వృద్ధ ఓటర్లకు, ఓటర్ల జాబితాలోని దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసే సౌకర్యం ఉందని తెలిపింది. 

వారంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును వేయవచ్చని ఈసీఐ చెప్పింది. ఇందుకు అర్హత ఉన్న ఓటర్లు నోటిఫికేషన్ తేదీ నుంచి 5 రోజుల్లోపు తమ సంబంధిత రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. దీని ప్రకారం కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఇంటి వద్ద ఓటింగ్ సౌకర్యం కోసం ఇప్పటివరకు 2.37 లక్షలకు పైగా ఓటర్లకు రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలిపారని ఈసీ తెలిపింది.

వీరిలో 85 ఏళ్లు దాటిన వారు అత్యధికంగా 1,45,521 మంది ఇంటి వద్ద ఓటింగ్ కోసం ఆమోదం తెలిపారని వివరించింది. ఇంటి వద్ద ఓటింగ్ షెడ్యూల్‌ను ఓటరుకు ముందుగానే తెలియజేస్తారని ఈసీ చెప్పింది. వారి ఓటు కోసం పోలింగ్ అధికారుల బృందం ఓటరు నివాసానికి వెళ్తుందని ఎన్నికల సంఘం వివరించింది. “కేరళ, అసోం, పుదుచ్చేరిలోని వివిధ నియోజకవర్గాల్లో ఇంటి వద్ద ఓటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 5వ తేదీలోగా పూర్తవుతుంది. మొదటిసారి ఓటరు అందుబాటులో లేకపోతే, రెండోసారి కూడా ప్రయత్నిస్తాం” అని ఈసీ ప్రకటనలో పేర్కొంది.

ఓటు గోప్యతను రక్షిస్తూనే అత్యంత పారదర్శకత కోసం పోలింగ్ అధికారులతో పాటు పోలీసు భద్రతతో కూడిన ఒక వీడియోగ్రాఫర్ ఉంటారని చెప్పింది. మొత్తం ప్రక్రియను వీడియో తీస్తారని ఈసీఐ వివరించింది. “గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు, ఇంటి వద్ద ఓటింగ్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న ఓటర్ల జాబితాను అందిస్తారు. పోలింగ్ బృందాల పర్యటనల షెడ్యూల్ను అభ్యర్థులందరికీ సమాచారం ఇస్తారు. 

వారు కోరుకుంటే ఫారం 10లో రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించిన తర్వాత, పోలింగ్ బృందాలతో పాటు తమ ప్రతినిధిని పంపవచ్చు అని  పేర్కొన్నారు. ఇంటి వద్ద ఓటింగ్ సౌకర్యాన్ని ఎంచుకోని 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు సౌకర్యవంతమైన ఓటింగ్ అనుభవాన్ని అందిస్తామని ఎన్నికల సంఘం చెప్పింది. ఇందుకోసం పోలింగ్ కేంద్రాల వద్ద వాలంటీర్లు, వీల్‌చైర్లు, ఇతర సహాయంతో సహా అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని తెలిపింది.