ఇరాన్‌లో భూతల దాడులకు దిగాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే ఆ దేశంలో ఉన్న 60 శాతం శుద్ధి చేసిన సుమారు 400 కిలోల యురేనియం కోసమే అగ్రరాజ్యం భూతాల దాడులకు సిద్దమైనట్లు తెలుస్తోంది. శుద్దీకరించిన యురేనియంతో అణ్వాయుధాలు తయారు చేస్తున్నట్లు ఇరాన్‌పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అణ్వాయుధ సమీకరణను వ్యతిరేకిస్తూ అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా ఇరాన్‌పై దాడికి దిగాయి. ఇరాన్‌పై దాడి ప్రారంభమై ఇప్పటికే నాలుగు వారాలు ముగిసింది.
ఈ నేపథ్యంలో యురేనియంను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ సర్కారు భావిస్తున్నారు. అణ్వాయుధ తయారీకి అవసరమైన స్థాయిలో ఆ యురేనియం శుద్ధి చేసి ఉండటంతో అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే ఇరాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి ఆ యురేనియంను అప్పగించేందుకు అంగీకరించేలా చేయడం యుద్ధ ముగింపు నిబంధనల్లో ఒకటిగా చేర్చమని ఒత్తిడి చేస్తున్నారు.
యుద్ధం ఆపాలంటే యురేనియం అప్పగించాలని ఇరాన్‌పై అమెరికా వత్తిడి తెస్తున్నట్లు అంతర్జాతీయ పత్రిక ద వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని రాసింది. న్యూక్లియర్ మెటీరియల్ ఇరాన్ వద్ద ఉండకూడదని, అవసరమైతే బలవంతంగానైనా దాన్ని సీజ్ చేయాలని ట్రంప్ తన టీమ్‌కు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఒకవేళ చర్చల్లో ఇరాన్ తలొగ్గకపోతే సైనిక చర్యే శరణ్యమని అమెరికా భావిస్తున్నారు. అయితే పాకిస్థాన్ వేదికగా ప్రస్తుతం అమెరికా, ఇరాన్ దౌత్యవేత్తల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి.
ఒకవేళ అన్నీ సజావుగా సాగితే అమెరికా తన భూతల దాడి ప్రణాళికను విరమించే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ దీవిని కూడా స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనలో అమెరికా ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ఇరాన్‌లో ఎన్నో కీలకమైన టార్గెట్లను ధ్వంసం చేశామని, తమ మిలిటరీ ఆ పని చేసినట్లు ఆయన తన ట్రుత్ సోషల్ పోస్టులో వెల్లడించారు. తమ సైన్యం ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైందని, చాలా ప్రమాదకరమైందని, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఆపరేషన్‌లో తమ దృష్టంతా ప్రధానంగా ఇరాన్ వద్ద ఉన్న సుసంపన్న యురేనియం నిల్వలపై ఉందని నెతన్యాహు చెప్పారు. ఈ యురేనియాన్ని పూర్తిగా తొలగించడం లేదా అంతర్జాతీయ సంస్థలకు అప్పగించడం ద్వారా ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధి సామర్థ్యాన్ని శాశ్వతంగా నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇరాన్ సైనిక, అణు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలపై ఇప్పటికే కోలుకోలేని దెబ్బ కొట్టామని నెతన్యాహు వివరించారు.
“వాళ్లు అణ్వాయుధాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు, వాటిని అమెరికా నగరాలపై వినియోగించే సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటున్నారు. ఆ పర్యవసానాన్ని నివారించడమే ఈ యుద్ధం ముఖ్య ఉద్దేశం” అని నెతన్యాహు స్పష్టం చేశారు.

More Stories
భారత్‌కు వెళ్తున్న ఇరాన్ విమానంపై అమెరికా దాడి
హర్మూజ్ జలసంధిని తెరవకుంటే ఖార్గ్ ద్వీపాన్ని పేల్చేస్తాం
చర్చలు అంటూనే భూతల దాడులకు సిద్ధపడుతున్న ట్రంప్