ఆంధ్రప్రదేశ్‌ను నక్సల్ రహిత రాష్ట్రంగా ప్రకటించిన డిజిపి

ఆంధ్రప్రదేశ్‌ను నక్సల్ రహిత రాష్ట్రంగా ప్రకటించిన డిజిపి
 
* మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావుతో సహా 9 మంది లొంగుబాటు 
 
నిషేధిత సిపిఐ (మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు (సిసిఎం), ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోన్ కమిటీ కార్యదర్శి అయిన చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్ తో సహా ఆ పార్టీకి చెందిన తొమ్మిది మంది లొంగిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ను నక్సల్ రహిత రాష్ట్రంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) హరీష్ కుమార్ గుప్తా ఎదుట సోమవారం ప్రకటించారు. 
 
దేశవ్యాప్తంగా మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం గడువు (మార్చి 31) విధించిన సరిగ్గా ఒక రోజు ముందు వారు లొంగిపోయి, తమ ఆయుధాలను అప్పగించారని డీజీపీ  తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎటువంటి మావోయిస్టు కార్యకలాపాలు జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. 
 
చెల్లూరి నారాయణరావుతో పాటు, కంపెనీ ప్లాటూన్ కమాండర్ కర్తం లచ్చు, ఏరియా కమిటీ సభ్యుడు పోడియం రాజే అలియాస్ రామే, ఇతర పార్టీ కార్యకర్తలు కర్తం ఆడమే అలియాస్ నాంగి, ముచాకి మాస అలియాస్ అజిత్, మాద్వి జోగి అలియాస్ రుకుణి, ముచాకి లక్ష్మణ్ అలియాస్ లక్మ, మాదివి ఆడమ, కడితి హుర్రే అలియాస్ ఉర్రా జనజీవన స్రవంతిలో కలిశారు.
 
వీరు ఒక ఇన్సాస్ రైఫిల్, 2 బిజిఎల్ ఆయుధాలు, ఐదు .303 రైఫిల్స్, ఐదు ఎస్ఎస్బిఎల్  రైఫిల్స్, ఆరు సింగిల్ షాట్ రైఫిల్స్, ఏడు బిజిఎల్ షెల్స్, 22 రౌండ్ల మందుగుండు సామగ్రి, 13 డిటోనేటర్లు, ఐదు జిలెటిన్ స్టిక్స్, 13 మ్యాన్ ప్యాక్‌లతో పోలీసుల ఎదుట లొంగిపోయారని డిజిపి విలేకరుల సమావేశంలో తెలిపారు. 
 
లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు 2018లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమేశ్వరరావు హత్య కేసులలోనూ; అలాగే 2001లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ముద్దడ గాంధీ, ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, ఒక కానిస్టేబుల్ హత్య కేసులోనూ ప్రధాన నిందితుడిగా ఉన్నారని హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. చెల్లూరి నారాయణరావు తలపై రూ. 25 లక్షల రివార్డు ఉండగా, కర్తం లచ్చు తలపై రూ. 5 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 
 
ఏప్రిల్ 2021లో జరిగిన టెక్కులగూడ మందుపాతర దాడిలో (దీనిలో 22 మంది పోలీసులు మరణించారు), అలాగే 2024లో ధర్మవరం శిబిరంపై జరిగిన దాడిలో, 2023లో ఎలమగుండ శిబిరంపై జరిగిన దాడిలో కర్తం లచ్చు ప్రమేయం ఉందని డిజిపివివరించారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సహాయం కింద రూ. 20,000 అందజేశారు.