జనగణనలో సహజీవన జంటలకు కుటుంబ హోదా

జనగణనలో సహజీవన జంటలకు కుటుంబ హోదా

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన-2027 ప్రక్రియ మొదటి దశ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా హౌజ్ లిస్టింగ్ – హౌజింగ్ సెన్సస్ (హెచ్ఎల్ఓ)ను నిర్వహించనున్నారు. వివాహం చేసుకోకుండా చాలాకాలంగా కలిసి ఉంటున్న జంటలను ఇకపై ఒకే కుటుంబంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

సహజీవన జంటలను పెళ్లయిన దంపతులలాగే పరిగణించాలని నిర్ణయించింది. ఈ మేరకు జనగణన నిబంధనల్లో కీలక మార్పులు చేశారు. తొలిసారిగా ప్రజలకు స్వయంగా తమ వివరాలను సెల్ఫ్ ఎన్యుమరేషన్ పోర్టల్‌లో నమోదు చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు.  ఈ క్రమంలో ప్రజల సందేహాలను తీర్చేందుకు తరుచుగా అడిగే 33 ప్రశ్నల సమాధానాలను ఆ పోర్టల్‌లో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఆర్‌జీఐ) పొందుపర్చింది. హౌజ్ లిస్టింగ్ – హౌజింగ్ సెన్సస్‌ సందర్భంగా ఈ 33 ప్రశ్నలనే ప్రజలను ఎన్యుమరేటర్లు అడగనున్నారు.

ఈ సందర్భంగా సోమవారం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ కీలక వివరాలను వెల్లడించారు. జనగణన చట్టం (సెన్సస్ యాక్ట్)‌లోని సెక్షన్ -15 అనేది అత్యంత కీలకమైందని, దీని ప్రకారం జనగణన వేళ ప్రజలు అందించే సమాచారాన్ని విశ్వసనీయమైనదిగా పరిగణిస్తామని ఆయన తెలిపారు.  చివరకు సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద కూడా ఆ సమాచారాన్ని తాము బహిర్గతపర్చమని స్పష్టం చేశారు.

కోర్టులో రుజువుగానూ ఆ సమాచారాన్ని అందించమని, ఏ ఇతర సంస్థకూ ఈ వివరాలను అందించమని మృత్యుంజయ్ తేల్చి చెప్పారు. జనగణన ప్రక్రియలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు.  గృహగణన ప్రక్రియలో భాగంగా ప్రజలను తొలుత బిల్డింగ్ నంబర్, సెన్సస్ ఇంటి నంబరు, ఇంటి ఫ్లోర్, గోడలు, పైకప్పు నిర్మాణానికి వినియోగించిన మెటీరియల్ గురించి అడుగుతారు. ఇంటిని ఎలా వినియోగిస్తున్నారు.

ఇంటి పరిస్థితి ఎలా ఉంది, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు వంటి ప్రశ్నలు కూడా ఉంటాయి. ఇంట్లో ఉండే వాళ్లలో వివాహితులు ఎంతమంది, ఇంటి పెద్ద ఎవరు? వారి పేర్లు ఏమిటి, ఏ వర్గం వారు, ఇంటి ఓనర్ ఎవరు, ఏయే ఆహారధాన్యాలు తింటారు, ఇంట్లోని కనీస, ఆధునిక సౌకర్యాలు ఏమిటి, ఏ రకం వాహనాలు ఉన్నాయి అనే ప్రశ్నలను అడుగుతారు.  క్షేత్రస్థాయిలో జనగణనను నిర్వహించేందుకు యావత్ పాలనా యంత్రాంగాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వినియోగిస్తాయని పేర్కొన్నారు. 

“సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితుల వివరాలతో పాటు వలసలు, సంతానోత్పత్తి స్థితిగతులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తాం. రెండో దశలో కులగణన వివరాలు సేకరిస్తాం. https://se.census.gov.in వెబ్ పోర్టల్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. 11,718 కోట్ల రూపాయలతో జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది. 16 భాషల్లో మొబైల్ యాప్ ద్వారానే జనాభా లెక్కల సేకరణ ఉంటుంది. ఎన్యుమరేటర్స్ సొంత మొబైల్స్ ద్వారానే జనాభా లెక్కలను సేకరిస్తారు” అని తెలిపారు.

చివరిసారిగా మన దేశంలో 2011లో జనగణన జరిగిందని, ఇది భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరుగుతున్న 8వ జనగణన అని మృత్యుంజయ్ చెప్పారు.  రెండవ దశకు సంబంధించిన ప్రశ్నలను కొన్ని నెలల్లో తెలియజేస్తామని నారాయణ్ తెలిపారు. మంత్రివర్గం ఆమోదం తెలిపినందున, ఈ దశలో కుల గణన కూడా చేపట్టబడుతుంది. అయితే, కుల గణన విధానం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. రెండవ దశలో మత గణన కూడా నిర్వహించబడుతుంది.