అమెరికాలో మళ్లీ హోరెత్తిస్తున్న ‘నో కింగ్స్‌’ నిరసనలు

అమెరికాలో మళ్లీ హోరెత్తిస్తున్న ‘నో కింగ్స్‌’ నిరసనలు

పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికాలో మళ్లీ ‘నో కింగ్స్‌’ నిరసనలు హౌరెత్తాయి. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పరిపాలనకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు శనివారం ‘నో కింగ్స్‌’ నిరసనలలో పాల్గొన్నారు. 50 రాష్ట్రాలలో, 16 దేశాలలో 3 వేలకు పైగా ఎక్కువ కార్యక్రమాలు జరిగాయి. ‘ఇండివిజిబుల్‌’, ‘50501’, ‘అధికార వ్యతిరేక’ వంటి సమూహాలు, కార్మిక సంఘాలు, ఇతర సామాజిక సంస్థలతో కూడిన నిర్వాహకుల కూటమి ఈ నిరసనలకు నాయకత్వం వహించారు.

ఈ నిరసనల్లో భాగంగా అమెరికన్లు అధిక సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. తమ నిరసన గళాన్ని వినిపించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ చర్యలను వ్యతిరేకించారు.. ‘నో కింగ్స్‌’ కూటమి ఈ కార్యాచరణ దినం ”అహింసాత్మక” స్వభావాన్ని పదేపదే చెప్పింది. నో కింగ్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం ‘నో కింగ్స్‌’ నిరసనలను బహిరంగంగా కించపరచడం నుంచి ట్రంప్‌ సర్కార్‌ వెనక్కి తగ్గింది.

ప్రజల శక్తిని నిర్మించడం, ట్రంప్‌ పరిపాలనతో పోరాడటం అనే విస్తృత ప్రయత్నాలలో ‘నో కింగ్స్‌ డే’ కేవలం ఒక అంశం మాత్రమేనని స్పష్టం చేసింది.  ”మా మూడో ‘నో కింగ్స్‌ డే ఆఫ్‌ యాక్షన్‌’ ప్రకారం.. ‘నో కింగ్స్‌’ను కేవలం ఒక శక్తివంతమైన ధిక్కార దినంగానే కాకుండా, ప్రతిచోటా స్థానిక సంఘటనలకు మద్దతు ఇచ్చే ఒక సంఘటన ఉత్ప్రేరకంగా కూడా చూస్తున్నాము”అని చెప్పారు.

కాగా తొలి రెండు రౌండ్ల నిరసనల్లో 50 నుంచి 70 లక్షల మంది వరకు పాల్గొన్నారనీ, అయితే ఈ మూడో ‘నో కింగ్స్‌’లో అంతకు మించి ఆందోళనకారులు పాల్గొంటారని నిర్వాహకులు చెప్పారు.  గతంలో జరిగిన ‘నో కింగ్స్‌’ నిరసనలు ట్రంప్‌పై అమెరికన్లలో నిరసనను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాయి. తాజాగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ ఈ నిరసనలు ప్రారంభమవడం ట్రంప్‌నకు కొత్త తలనొప్పిగా మారిందని విశ్లేషకులు చెప్తున్నారు.

‘ఇండివిజిబుల్‌’ సహ-వ్యవస్థాపకుడు ఎజ్రా లెవిన్‌ మాట్లాడుతూ, శనివారం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసన అవుతుందని పేర్కొన్నారు. గత అక్టోబర్‌లో జరిగిన నిరసనలో దేశవ్యాప్తంగా 7 మిలియన్ల మంది పాల్గొన్నారు. మిన్నెసోటాలోని ట్విన్‌ సిటీస్‌, మిన్నియాపాలిస్‌ , సెయింట్‌ పాల్‌లలో ఒక ‘ఫ్లాగ్‌షిప్‌’ కార్యక్రమం నిర్వహించారు. 

ఐసిఇ దాడుల నుండి ఓటింగ్‌ హక్కుల బెదిరింపుల వరకు అనేక సమస్యలు నిరసనకారులను బయటకు తీసుకువస్తాయని నిర్వాహకులు తెలిపారు. ‘వాయిసెస్‌ ఆఫ్‌ ఫ్లోరిడా’ కార్యనిర్వాహక డైరెక్టర్‌, ‘50501’ ఉద్యమానికి జాతీయ సమన్వయకర్త సారా పార్కర్‌ మాట్లాడుతూ, గత ‘నో కింగ్స్‌’ నుండి, మేము అధిక గ్యాస్‌ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలను చూస్తున్నాము, ఇరాన్‌లో అక్రమ యుద్ధం జరుగుతోంది. అమెరికా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.