నవ్యాంధ్ర భవిష్యత్తుకు పునాది అయిన అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించేలా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీసుకొచ్చిన చారిత్రాత్మక తీర్మానాన్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తుందని ఎపి బిజెపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ప్రకటించారు. ఇది కేవలం ఒక నిర్ణయం కాదని, రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కీలక అడుగు అని తెలిపారు. ఈ తీర్మానంలో ముఖ్యంగా అమరావతిని ఏకైక, శాశ్వత రాజధానిగా స్పష్టంగా ప్రకటించడం, రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు, రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5(2)కు తగిన వరణలు చేయాలని కోరుతూ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది.
గతంలో ఉన్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ, ఇప్పుడు స్పష్టతతో ముందుకు సాగేందుకు ఈ తీర్మానం బలమైన పునాది వేస్తోందని మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం సమయోచితం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఎంతో అవసరం అని తెలిపారు. ఇక అమరావతి నిర్మాణం విషయానికి వస్తే, ప్రారంభం నుంచే నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలిచిందని చెప్పారు.
2015లో అమరావతిని రాజధానిగా ప్రకటించగానే డీపీఆర్ లేకుండానే రూ. 2500 కోట్లు మంజూరు చేయడం, 2024లో రూ.15,000 కోట్ల భారీ నిధులు అందించడం, హుడ్కో ద్వారా రూ.11,000 కోట్ల రుణ సదుపాయం కల్పించడం, రూ. 2,245 కోట్లతో అమరావతికి రైల్వే లైన్ ప్రాజెక్ట్‌ను మంజూరు చేయడం జరిగిందని వివరించారు.
నూతన గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారుల ప్రాజెక్టులతో అమరావతిని దేశంలోని ప్రధాన పట్టణాలతో అనుసంధానించటానికి చర్యలు చేపట్టడం, కేంద్ర బడ్జెట్ కేటాయింపులు, పట్టణాభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల విస్తరణ ద్వారా అమరావతి అభివృద్ధికి నిరంతర మద్దతు కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. బిజెపి ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందని మాధవ్ తెలిపారు.
అమరావతి కేవలం ఒక నగరం కాదని, అది ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక, భవిష్యత్తు తరాలకు ఆశ అని చెప్పారు. ఇప్పుడు మనందరి బాధ్యత అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడం, పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు అవకాశాలు సృష్టించడం అని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మాధవ్ భరోసా ఇచ్చారు.
More Stories
అమరావతి చట్టబద్ధతకు శాసనసభ ఏకగ్రీవ తీర్మానం
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మరో ఆరుగురు అరెస్టు
విశాఖ తీరానికి ఎల్పీజీ, చమురు నౌకలు