యజ్ఞశాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒక ఎకరం విస్తీర్ణంలో వెదురు, గడ్డితో నిర్మించిన మండపం క్షణాల్లో కాలి బూడిదయింది. కాగా ప్రమాద సమయంలో యూపీ రవాణా మంత్రి దయాశంకర్ సింగ్, పలువురు ఉన్నతాధికారులు అక్కడే ఉన్నప్పటికీ అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మహాయజ్ఞం నిర్వహించిన ప్రాంతం అయోధ్యలోని రామాలయానికి సుమారు కిలోమీటరు దూరంలో ఉంది. మహాయజ్ఞం కోసం 1200 హోమగుండాలు ఏర్పాటు చేయగా, వీటిలో చాలామటుకు కాలిబూడదయ్యాయి.
మంటలు విస్తరించక ముందే వందలాది మంది భక్తులు అక్కడ నుంచి బయటపడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ముగ్గురు గాయాల బారిన పడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఆరు అగ్నిమాపక యంత్రాలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. యజ్ఞ గుండంలోని నిప్పురవ్వలు ఎగిసి పడటం వల్లనే మండపానికి మంటలు అంటుకుని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
అయితే యజ్ఞ నిర్వహణలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని, నిపుణుల పర్యవేక్షణ లేకుండానే ఇంతటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆరోపిస్తున్నారు. కేవలం ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో భద్రతా ఏర్పాట్లను గాలికి ఒదిలేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ భారీ కార్యక్రమం వెనుక ఉన్న ఆర్థిక వనరులు, మానవ వనరుల వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.

More Stories
శ్రీ లంకకు 38 వేల మెట్రిక్ టన్నుల ఇంధనం పంపిన భారత్
వీవీఐపీల విమానాలకు కొత్త నియమావళి
గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో 600 కి.మీ మేర చమురు తెట్టు