పరిపూర్ణ మానవత్వానికి ప్రతిరూపం శ్రీ రాముడు

పరిపూర్ణ మానవత్వానికి ప్రతిరూపం శ్రీ రాముడు

* శ్రీరాముడి శాశ్వత సద్గుణాలు తెలిపిన గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్

మానవ నాగరికతపై చెరగని ముద్ర వేసిన మహోన్నత గాథ రామాయణం గురించి అందరికీ తెలిసిందే. శతాబ్దాలు గడుస్తున్నా, కాల పరీక్షకు నిలిచి కోట్లాది మంది హృదయాల్లో భక్తిని నింపిన శ్రీరాముడి జీవితం నేటి తరానికి ఒక గొప్ప జీవన పాఠం కాగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ రాముడి వ్యక్తిత్వంలోని అద్భుతమైన కోణాలను వివరించారు.

ముఖ్యంగా రామాయణం వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అంతరార్థాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పుకొచ్చారు.  శ్రీరాముడు అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదని, ఒక పరిపూర్ణ మానవత్వానికి ప్రతిరూపం అని శ్రీశ్రీ రవిశంకర్ వెల్లడించారు. ఆయన ఒక మంచి కుమారుడిగా, శిష్యుడిగా, భర్తగా, పాలకుడిగా ప్రతి పాత్రను అత్యంత గౌరవప్రదంగా నిర్వహించారని చెప్పారు. అందుకే ఆయన్ని ‘మర్యాదా పురుషోత్తముడు’ అని పిలుస్తామని తెలిపారు.

రామరాజ్యం అంటే కేవలం ఒక కాలం కాదని, అది ఒక ఆదర్శ సమాజానికి చిహ్నం అని వివరించారు. అవినీతి లేని, నేరాలకు తావులేని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగే ఆదర్శవంతమైన పరిపాలనకు రామరాజ్యమే నిదర్శనం అని పేర్కొన్నారు. అంతేకాకుండా మహాత్మా గాంధీ సైతం తన చివరి శ్వాస వరకు రామ నామాన్ని స్మరించడం, రామరాజ్యాన్ని ఆకాంక్షించడం ఆ తత్వంలోని గొప్పతనాన్ని చాటుతోందని చెప్పారు.

ముఖ్యంగా మహాత్మా గాంధీయే నేరుగా ఓసారి “మీరు నా దగ్గర నుంచి అన్నింటినీ తీసుకున్నా నేను బ్రతుకుతాను. కానీ మీరు శ్రీ రాముడిని తీసేస్తే నేను జీవించలేను” అని చెప్పారని గుర్తు చేశారు. ఆయన చివరి మాటలు కూడా “హే రామ్” అనే వాక్యమే అని తెలిపారు.  జీవితంలో ఏ రంగంలోనైనా తప్పులేని పనిని నేటికీ ‘రాంభా’ అని, తిరుగులేని పరిష్కారాన్ని ‘రామబాణం’ అని పిలుస్తామని వివరించారు.

అంటే రాముడు అంటేనే ఒక ఖచ్చితత్వం, ఒక భరోసా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే సంస్కృతంలో ‘రామ’ అనే పదానికి ‘నాలో ఉన్న ప్రకాశం’ అనే అర్థం ఉందని తెలిపారు. ‘కౌశల్య’ అంటే నైపుణ్యం, ‘దశరథ’ అంటే పది రథాలు కలిగినవాడని అర్థం అని తెలిపారు. ఆ పది రథాలు అంటే మన శరీరంలోని పది ఇంద్రియాలు అని వివరించారు.

ఆ పది ఇంద్రియాల్లో పంచ జ్ఞానేంద్రియాలు (చెవులు, చర్మం, కళ్ళు, నాలుక, ముక్కు), పంచ కర్మేంద్రియాలు (మాట్లాడే అవయవం, చేతులు, కాళ్లు, ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే అవయవం , విసర్జన అవయవం) ఉంటాయని చెప్పారు.  నైపుణ్యంతో (కౌశల్య) ఇంద్రియాలను (దశరథ) అంతర్ముఖంగా మళ్లించి.. మనస్సును ప్రశాంతమైన అయోధ్యగా మార్చుకున్నప్పుడు.. ఆ ప్రశాంత స్థితిలో మనలో దివ్యమైన ప్రకాశం ఉదయిస్తుందని చెప్పారు.

ఆ వెలుగే రాముడు అని శ్రీశ్రీ రవిశంకర్ వివరించారు. అలాగే మహర్షి పతంజలి చెప్పిన్నట్లు.. మనలో ఉన్న ఆ వెలుగును తెలుసుకుంటే సంపూర్ణత, పవిత్రతను పొందుతామమన్నారు. ఐదు భూతాలతో నిర్మితమైన ఈ సృష్టిని మనం ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవిస్తూ ఐదు కర్మేంద్రియాల ద్వారా కార్యాచరణ చేస్తామని తెలిపారు.  ఇవన్నీ మన ఆనందం కోసం ఉన్నవే అయినప్పటికీ వాటిలో ఆసక్తి పెంచుకుని ఆనందాన్ని పొందాలని ప్రయత్నిస్తే దుఃఖం వస్తుందని పేర్కొన్నారు.

అదే వాటిని ఆస్వాదించి వదిలేయగలిగితే ఆనందం, ఉపశమనం, విముక్తి లభిస్తాయని చెప్పుకొచ్చారు. అలాగే ఈ శ్రీరామనవమి వేడుకలను కేవలం బాహ్య ఆచారాలకే పరిమితం చేయకుండా బాహ్య ఇంద్రియ సుఖాల నుంచి మనస్సును ఉపసంహరించి, మనలోని శాశ్వతమైన ‘రామ’ జ్యోతిని వెలిగించడమే నిజమైన పండుగ అని స్పష్టం చేశారు. ఆ అంతరంగ వెలుగుతో మన జీవితాలను పవిత్రం చేసుకుందామని శ్రీశ్రీ రవిశంకర్ సూచించారు.