ఆంగ్లికన్ చర్చిలో తొలి మహిళా ఆర్చ్‌బిషప్‌

ఆంగ్లికన్ చర్చిలో తొలి మహిళా ఆర్చ్‌బిషప్‌

ఆంగ్లికన్ చర్చిలో చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. సారా ములాలీ కాంటర్‌బరీకి తొలి మహిళా ఆర్చ్‌బిషప్‌గా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం కాంటర్‌బరీ కేథడ్రల్‌లో జరిగిన దీక్షా కార్యక్రమంలో ఆమె అధికారికంగా పదవిలోకి ప్రవేశించారు.  శతాబ్దాలుగా శతాబ్దాలుగా కేవలం పురుషులు మాత్రమే ఉన్న ఈ అత్యున్నత పదవిని చేపట్టిన 106వ ఆర్చ్‌బిషప్‌గా సారా నిలిచారు.

క్రీ.శ. 597లో సెయింట్ అగస్టీన్‌ కాంటర్‌బరీతో ప్రారంభమైన ఈ సంప్రదాయంలో ఇప్పటి వరకు ఉన్న 105 మంది ఆర్చ్‌బిషప్‌లు అందరూ పురుషులే కావడం గమనార్హం.  దాదాపు 1,400 సంవత్సరాల చరిత్రలో ఒక మహిళ ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. 63 ఏళ్ల సారా ములాలీ గతంలో నర్సింగ్ రంగంలో విశేష సేవలందించారు. మహిళలను చర్చిలో ఉన్నత స్థానాలకు అనుమతించినప్పటికీ, అత్యున్నత స్థాయి అయిన ఆర్చ్‌బిషప్ పదవిని ఇప్పుడే మహిళ అధిరోహించడం విశేషం.

ఈ కార్యక్రమానికి వేల్స్ యువరాజు విలియం, ఆయన భార్య కేథరీన్, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌తో పాటు సుమారు 2,000 మంది హాజరయ్యారు. కాంటర్‌బరీ ప్రాంతానికి చెందిన నర్సులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆంగ్లికన్ కమ్యూనియన్ ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా విశ్వాసులను కలిగిన స్వతంత్ర చర్చిల సమూహంగా కొనసాగుతోంది.