ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు దేశంలో 100 కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మిండానికి కేంద్రం సిద్ధమైంది. దీనిలో భాగంగా ఎయిర్‌పోర్టులతోపాటు, హెలిపోర్టులు, వాటర్ ఏరోడ్రోమ్స్‌ను కూడా కేంద్రం నిర్మించనుంది. 2026-2027 నుంచి 2035-2036 వరకు, పదేళ్లపాటు రూ.28,840 కోట్ల వ్యయంతో సవరించిన ఉడాన్ స్కీమ్ కింద వీటిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీని ద్వారా చిన్న పట్టణాలకు ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతుందని కేంద్రం చెబుతోంది. ఏవియేషన్ నెట్‌వర్క్‌ను విస్తరించడం, ప్రాంతీయ రవాణా వ్యవస్థ బలోపేతం, ఆర్థిక రంగానికి ఊతమివ్వడం వంటి లక్ష్యాలతో కేంద్రం కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. దేశంలో విమాన సర్వీసులు తక్కువగా ఉన్న, పూర్తిగా విమాన సర్వీసులు లేని పలు నగరాల్లో మోడిఫైడ్ ఉడాన్ పథకం ద్వారా విమాన సర్వీసులను అందుబాటులోకి తేనున్నారు.
ఇక ఇదే సమయంలో సాధారణ పౌరుల విమాన ప్రయాణ ఛార్జీలను వీలైనంత తక్కువగా ఉంచేందుకు ఈ స్కీం ద్వారా తోడ్పాటును అందించనున్నారు. ఇప్పటివరకు ఎయిర్ కనెక్టివిటీ లేని టైర్ 2 పట్టణాల నుంచి టైర్ 3 పట్టణాల వరకు, హిల్ స్టేషన్లు, సరిహద్దు ప్రాంతాలు, ఐలాండ్స్ ఇలా మొత్తంగా 100 ఎయిర్‌పోర్టులు వంటివి నిర్మిస్తారు. అలాగే, ఎయిర్‌పోర్టులు నిర్మించడానికి వీలుకాని ప్రదేశాల్లో 200 ప్రత్యేక హెలిప్యాడ్లు, వాటర్ ఏరోడ్రోమ్స్ వంటివి కూడా నిర్మితమవుతాయి.
“ప్రస్తుతం వినియోగంలో లేని ఎయిర్ స్ట్రిప్‌లను కూడా ఈ స్కీం ద్వారా తిరిగి వినియోగంలోకి తెస్తాం. 100 కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణ పనుల కోసం రాబోయే 8 ఏళ్లలో రూ.12,159 కోట్లు ఖర్చు చేస్తాం. తద్వారా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విమానయాన వ్యవస్థ మన దేశంలోనూ అందుబాటులోకి వస్తుంది” అని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ తెలిపారు.
అలాగే 441 ఏరోడ్రోమ్‌ల నిర్మాణంతోపాటు నిర్వహణ ఖర్చుల కోసం మరో రూ.2,577 కోట్లను కూడా కేంద్రం కేటాయించనుంది. మరోవైపు ఇప్పటికే నిర్మితమై ప్రయాణికుల డిమాండ్ తక్కువగా ఉన్న చోట కూడా ఇకపై సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయి.
కాగా, ఇమిగ్రేషన్, వీసా, ఫారినర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ (ఐవిఎఫ్ ఆర్టి) స్కీం అమలును మరో ఐదేళ్లు పొడిగించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీం ద్వారా ఇమిగ్రేషన్, వీసా జారీ, భారత్‌లోని విదేశీయుల రిజిస్ట్రేషన్‌లతో ముడిపడిన ప్రక్రియలను అత్యాధునిక టెక్నాలజీతో పరస్పరం అనుసంధానిస్తారు. ఐవిఎఫ్ ఆర్టి స్కీంను మళ్లీ 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం రాబోయే ఐదేళ్లలో రూ.1,800 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
More Stories
దేశంలో సరిపడా ఇంధన నిల్వలు- ఎవరూ భయపడొద్దు
పైప్ గ్యాస్‌కు మారకపోతే ఎల్పీజీ సరఫరా నిలిపివేత
రైతు రుణమాఫీ ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో లేదు