* ‘గ్యాస్’ ఛార్జీలు వసూలుపై రెస్టారెంట్లకు కేంద్రం హెచ్చరిక!
దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అందులోబాటులో ఉన్న పైప్ గ్యాస్ విధానానికి మారాలని వినియోగదారులకు సూచించింది. లేనిపక్షంలో ఎల్‌పీజీ సరఫరా నిలిపివేసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దీని కోసం మూడు నెలలు గడువు ఇస్తూ మార్చి 24న కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎల్‌పీజీ నుంచి పీఎన్జీకి మార్పు ఐచ్ఛికం కాదని, తప్పని సరి అని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పైపుల ద్వారా సహజ వాయువు (పీఎన్‌జీ) అందుబాటులో ఉన్నట్లు సంబంధిత అధీకృత సంస్థ ఎల్‌పీజీ వినియోగదారులకు సమాచారం ఇస్తుంది. ఆ సమాచారం అందిన తేదీ నుంచి మూడు నెలలోపు తప్పని సరిగా పీఎన్‌జీకి మారాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆ ఇంటికి ఎల్‌పీజీ సరఫరా నిలివేస్తారు.
అయితే పీఎన్జీ కనెక్షన్ అందించడం సాంకేతికంగా అసాద్యమైతేనే ఎల్‌పీజీ సరఫరా కొనసాగుతుంది. దీని కోసం పీఎన్జీ సరఫరా సంస్థ జారీ చేసే నిరభ్యంతర ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉన్నది. మరోవైపు గ్యాస్ పైప్‌లైన్‌ల ఏర్పాటు వేగవంతం, నిర్దిష్ట కాలపరిమితిలోగా అనుమతులు మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎన్జీ కనెక్షన్‌ను 48 గంటలలోపు అందించాలని, దరఖాస్తులను తిరస్కరించడానికి వీలు లేదని ఆయా ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. నిత్యావసర వస్తువుల చట్టం కింద ఈ మేరకు కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.
ఇలా ఉండగా, రెస్టారెంట్లలో భోజనం చేసిన తర్వాత బిల్లులో ‘ ఎల్‌పీజీ ఛార్జీలు’ లేదా ‘ఫ్యూయల్ సర్ ఛార్జీలు’ పేరుతో అదనపు మొత్తాన్ని వసూలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇటీవల సోషల్ మీడియాలో చాలా మంది వినియోగదారులు తమ బిల్లుల ఫోటోలను షేర్ చేస్తూ, ఆహార పదార్థాల ధరల కంటే అదనంగా గ్యాస్ ఖర్చులను వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు చేశారు.
ఈ అదనపు బాదుడు వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుండటంతో, కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సిసిపిఎ) రంగంలోకి దిగింది. మెనూలో పేర్కొన్న ధరల కంటే ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.

More Stories
‘మోడిఫైడ్ ఉడాన్’ ద్వారా దేశంలో 100 కొత్త ఎయిర్పోర్టులు
దేశంలో సరిపడా ఇంధన నిల్వలు- ఎవరూ భయపడొద్దు
రైతు రుణమాఫీ ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో లేదు