గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలు తొలగిస్తేనే చర్చలు

గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలు తొలగిస్తేనే చర్చలు
ముందుగా అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని తేల్చిన ఇరాన్, ఇప్పుడు మాత్రం స్వరం మార్చింది. తమ ప్రతిపాదనలకు అంగీకరిస్తే అమెరికాతో చర్చలు జరుపుతామని ప్రకటించింది. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక క్యాంపులను ఎత్తివేయడం అన్నింటికంటే కీలకమైన షరతు. అలాగే, ఇరాన్‌పై ఉన్న ఆంక్షల్ని ఎత్తివేయడంతోపాటు నౌక రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిపై పూర్తి హక్కు కలిగి ఉండాలి. అలాగే, యుద్ధం వల్ల తమకు కలిగిన నష్టానికి పరిహారాన్ని కూడా ఇరాన్ కోరింది. దీంతోపాటు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని కూడా  డిమాండ్ చేసింది. హార్ముజ్ జలసంధి నుంచి రవాణా చేసే నౌకలపై పన్ను వసూలు చేస్తారు. దీనికి సంబంధించి పూర్తి ఆధిపత్యం తమకు దక్కాలని ఇరాన్ కోరుతోంది.  ఇకపై ఈ ప్రాంతంలో తిరిగి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూస్తామని అమెరికా హామీ ఇవ్వాలి. ఇలాంటి అనేక డిమాండ్లను ఇరాన్ అమెరికా ముందుంచింది.

వీటితోపాటు కొన్ని అంశాల విషయంలో ఇరాన్ పట్టువీడినట్లు తెలుస్తోంది. ఐదేళ్లపాటు బాలిస్టిక్ మిస్సైళ్ల తయారీని నిలిపివేస్తామని తెలిపింది.  అలాగే, యురేనియం నిల్వల్ని కూడా తగ్గించుకునేందుకు అంగీకరించింది. ఇరాన్‌లోని అణ్వాయుధాలు, యురేనియంపై అంతర్జాతీయ సంస్థల తనిఖీకి కూడా అంగీకరించింది. మరోవైపు తీవ్రవాద నిర్మూలనలో కూడా పాలుపంచుకునేందుకు ముందుకొచ్చింది.

దీనిలో భాగంగా ఇరాన్ సమీపంలోని దేశాల్లో ఉండే హెజ్బొల్లా, హమాస్, ఇరాకి మిలీషియాస్ వంటి తీవ్రవాద సంస్తలకు నిధులు అందించడం నిలిపివేస్తామని కూడా తెలిపింది. అయితే, ఈ అంశాలన్నింటిపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ, అమెరికాతో చర్చల విషయంలో మధ్యవర్తుల ద్వారా సందేశం పంపినట్లు తెలుస్తోంది.  అమెరికా కూడా ఇరాన్‌కు 15 అంశాలతో శాంతి ప్రణాళిక ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలపై ఇంకా ఎలాంటి ముందడుగు పడలేదు.

ఇరాన్‌తో యుద్ధం ఆపి శాంతి చర్చలను  ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్‌ రాయబారి డానీ డనోస్‌ కొట్టిపారవేస్తూ ఇరాన్‌ అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకుండా చూడడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ‘ఇరాన్‌తో శాంతి చర్చల గురించి తనకు తెలియదని పేర్కొంటూ తాము మేము ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. 

మరోవంక, హార్ముజ్ జలసంధి మూసివేతతో ఇబ్బందులు పడుతున్న ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చేలా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అది పాక్షికంగానే. అందులోనూ నౌకల రవాణాకు అనేక షరతులు వర్తిస్తాయి. తమ శతృదేశాలతో సంబంధం లేని నౌకల్ని మాత్రమే ఈ జలసంధి నుంచి అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంఓ)కు ఇరాన్ ఒక లేఖ ద్వారా తెలిపింది.