చర్చలు అంటూనే 2000 మంది పారాట్రూప‌ర్లను మోహ‌రించిన ట్రంప్

చర్చలు అంటూనే 2000 మంది పారాట్రూప‌ర్లను మోహ‌రించిన ట్రంప్

* పశ్చిమాసియాలో ఆగని దాడులు, కొలిక్కి రాని దౌత్య యత్నాలు

‘ఐదు రోజులు వాయిదా…’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినా ఇరాన్‌పై దాడులు ఆగలేదు. మంగళవారం కూడా కొనసాగాయి. అమెరికా అధ్యక్షుడి ప్రకటనను ఇజ్రాయిల్‌ ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇరాన్‌లో ఎంపిక చేసిన లక్ష్యాలపై ఆదేశం దాడులు కొనసాగించింది. అమెరికా సైన్యం కూడా దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి.  ఇరాన్‌తో శాంతి చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు చెప్పిన ట్రంప్‌ ఇరాన్ భూభాగానికి స‌మీపంలో రెండు వేల మంది పారాట్రూప‌ర్ల‌ను మోహ‌రించారు.
ఏ క్ష‌ణ‌మైన వాళ్లు దాడికి పాల్ప‌డే అవకాశాలు ఉన్నాయి. భూత‌ల దాడులు చేస్తే తిప్పికొడుతామ‌ని ఇరాన్ చెబుతున్న నేప‌థ్యంలో పెంట‌గాన్ అధికారులు కొత్త ఆదేశాలు జారీ చేశారు. అమెరిక‌న్ ఆర్మీలోని 82వ ఎయిర్‌బార్న్ డివిజ‌న్‌కు చెందిన సుమారు 2000 మంది ఎలైట్ బ‌ల‌గాలు అంద‌బాటులో ఉండ‌నున్నాయి. ఇరాన్ భూభాగానికి అతిస‌మీపంగా ఆ ద‌ళాలు మోహ‌రించి ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై అమెరికాకు చెందిన వాషింగ్ట‌న్ పోస్టు, న్యూయార్క్ టైమ్స్ క‌థ‌నాలు రాశాయి.
ఆదేశాలు ఇచ్చిన 18 గంట‌ల లోపే విమానాశ్ర‌యాల‌ను, ఎంబ‌సీల‌ను సీజ్ చేసే స‌త్తా ఈ ద‌ళానికి ఉంటుంది. వీలైనంత మందిని త‌ర‌లించ‌గ‌ల‌రు కూడా. ఈ వారం చివ‌ర‌లో మ‌రో 2500 మెరైన్లు కూడా గ్రౌండ్ ఆప‌రేష‌న్ కోసం సిద్ధం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఖ‌ర్గ్ దీవిలో ఉన్న ప్ర‌ధాన ఆయిల్ ఎగుమ‌తి కేంద్రాన్ని సీజ్ చేయాల‌న్న ఉద్దేశంతో అమెరికా ఉన్న‌ట్లు భావిస్తున్నారు. దీని కోస‌మే పారాట్రూప‌ర్లు రెఢీ అవుతున్న‌ట్లు అంచనా వేస్తున్నారు.
ఇరాన్‌కు స‌మీపంగా వ‌స్తే అమెరికా సైనికుల‌ను ఎలా ఎదుర్కోవాలో త‌మ ద‌ళాల‌కు తెలుసు అని ఇటీవ‌ల ఇరాన్ సీనియ‌ర్ మిలిట‌రీ అడ్వైజ‌ర్ అలీ అక్బ‌ర్ అహ్మ‌దిన్ వార్నింగ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇరాన్‌లోని చమురు క్షేత్రాలు, పవర్‌ ప్లాంట్లపై ఐదు రోజులపాటు దాడులను నిలిపేస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించినప్పటికీ, ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మాత్రం తగ్గడం లేదు. మంగళవారం కూడా ఇరు దేశాలూ పరస్పర దాడులకు దిగాయి.
ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులు చేయగా ఐఆర్‌జీసీ హెడ్‌క్వార్టర్స్‌, గ్యాస్‌ ప్లాంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులను ముమ్మరం చేసింది.  ట్రంప్‌ ప్రకటన వెలువడిన మరుసటి రోజే ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ బాంబులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌, ఇలాట్‌, డిమోనా నగరాలతో పాటు గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది.
ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలతో పాటు కువైట్‌లోని విద్యుత్తు లైన్లు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి. 100 కిలోల పేలుడు పదార్థాలను మోసుకొచ్చిన క్షిపణులు పలు భవనాలను ధ్వంసం చేశాయని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
 
కాల్పుల విరమణకు ట్రంప్ 15 షరతులు!
 
మరోవైపు ఇరాన్‌తో జరుగుతున్న చర్చలలో అనిశ్చితి నెలకొందని, దీంతో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ చెప్పారు. తాము అధికారికంగా ప్రకటించే వరకూ ఎలాంటి ఊహాగానాలను నమ్మవద్దన్నారు. అమెరికా అధ్యక్ష భవనం ప్రకటనతో బ్యారల్‌ చమురు ధర మళ్లీ వంద డాలర్లు దాటింది.  ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ అమెరికాతో చర్చలకు అంగీకరించినట్టు సౌదీ అరేబియాకు చెందిన అల్‌ అరేబియా ఇంగ్లిష్‌ ఛానల్‌ వెల్లడించింది. 
 
అంతేకాకుండా, అమెరికాతో ఒప్పందాన్ని కూడా ఆయన కుదుర్చుకున్నట్టు తెలిపింది. అయితే, దీనిపై ఇరాన్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణను నిలిపివేసే ప్రయత్నంలో భాగంగా, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌కు 15 సూత్రాలతో కూడిన వివరణాత్మక కాల్పుల విరమణ ప్రతిపాదనను సమర్పించినట్లు సమాచారం. 
 
అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) ప్రకారం, ఈ ప్రణాళికను పాకిస్థాన్‌కు చెందిన మధ్యవర్తుల ద్వారా అందించారు. వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య కొత్త చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి కూడా పాకిస్థాన్ ముందుకొచ్చింది.   అయితే, న్యూక్లియర్‌ ప్రోగ్రామ్‌ను నిలిపివేయాలని, బాలిస్టిక్‌ క్షిపణుల శక్తి-సామర్థ్యాల పరీక్షలను ఆపేయాలంటూ అమెరికా విధించే కీలక షరతులకు ఇరాన్‌ ఒప్పుకోకపోవచ్చని ఇజ్రాయెల్‌ అధికారులు పేర్కొన్నారు. మొత్తంగా ఈ డీల్‌ ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు.
 

కాల్పుల విరమణ ప్లాన్‌పై ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి స్పందిస్తూ అమెరికాపై విమర్శలు గుప్పించారు. “మీ ఓటమిని శాంతి ఒప్పందంగా పిలవొద్దు. ఈ ప్రాంతంలో మీ పెట్టుబడులను మేం అంగీకరించబోం” అని ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి స్పష్టంచేశారు. యుద్ధం ముగింపుపై అమెరికాతో చర్చల వార్తలను కూడా ఖండించారు.

 
యుద్ధ మంత్రిపై నెట్టేసిన ట్రంప్ 
 
ఇరాన్‌ యుద్ధం విషయంలో తనపై వస్తున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నెపాన్ని యుద్ధ మంత్రిపై నెట్టేసి చేతులు దులుపుకున్నారు. ఇరాన్‌పై దాడి చేయాలంటూ ముందుగా చెప్పింది యుద్ధ శాఖ మంత్రి పీట్‌ హెగ్‌సేథేనని ట్రంప్‌ తెలిపారు.  టేనస్సీలోని మెంఫిస్‌ సేఫ్‌ టాస్క్‌ ఫోర్స్‌లో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ ఇరాన్‌పై సైనిక చర్య జరపడానికి ముందు తాను కొందరు మంత్రులు, అధికారులను సంప్రదించానని చెప్పారు.
ఇరాన్‌పై దాడికి ముందుగా మద్దతు ఇచ్చింది హెగ్‌సేథేనని తెలిపారు. సమావేశంలో పక్కనే కూర్చున్న హెగ్‌సేథ్‌ను ఉద్దేశించి ‘పీట్‌…దీనిపై తొలుత మాట్లాడింది నువ్వే అనుకుంటా. ఇరాన్‌ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని, కాబట్టి మనమే దాడి చేద్దామని మీరు అన్నారు’ అంటూ చెప్పుకొచ్చారు. ట్రంప్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.