ట్రాన్స్‌జెండర్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ట్రాన్స్‌జెండర్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కులు, రక్షణకు సంబంధించిన చట్టంలో సవరణలు చేయడానికి తీసుకొచ్చిన బిల్లును  ప్రతిపక్షాల వాకౌట్ మధ్య, లోక్‌సభ మంగళవారం మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది. ఈ బిల్లులో గే, లెస్బియన్ వంటి లైంగిక అభిరుచులను చట్ట పరిధి నుంచి మినహాయించడం పై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) సవరణ బిల్2026పై జరిగిన చర్చకు స్పందించిన సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్, ఈ చట్టం జీవ వైజ్ఞానిక కారణాల వల్ల సామాజికంగా బహిష్కరణకు గురయ్యే వ్యక్తులకు మాత్రమే రక్షణ కల్పించడం లక్ష్యమని తెలిపారు. ఈ సవరణతో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు చట్టపరమైన గుర్తింపు, రక్షణ కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. 2019 చట్టంలో గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష ఉండగా, కొత్త సవరణ బిల్లులో గరిష్టంగా 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం కల్పించినట్లు మంత్రి వివరించారు.
బిల్లు ఆమోదానికి ముందు ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలను సభ వాయిస్ ఓటుతో తిరస్కరించింది. ప్రతిపక్షం ఈ చట్టం వ్యక్తిగత లైంగిక గుర్తింపు నిర్ణయించే హక్కును దూరం చేస్తోందని విమర్శించింది. ముఖ్యంగా గే, లెస్బియన్ వ్యక్తులను ఈ చట్ట పరిధి నుంచి తప్పించడం సరికాదని పేర్కొంటూ, బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేసింది. 
 
ఈ బిల్లు ట్రాన్స్‌జెండర్ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలని ప్రతిపాదిస్తూ, ‘లైంగిక అభిరుచులు, స్వీయ లైంగిక గుర్తింపులు’ చట్ట పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులుగా పరిగణించబడే వర్గంలో ఇవి ఎప్పటికీ చేరవని బిల్లులో పేర్కొంది. సమాజంలో తీవ్రమైన వివక్షకు గురయ్యే ట్రాన్స్‌జెండర్ వర్గాన్ని రక్షించడమే ఈ చట్టం ఉద్దేశమని, అన్ని రకాల లైంగిక గుర్తింపులు లేదా జెండర్ ఫ్లూయిడిటీ కలిగిన వర్గాలకు ఇది వర్తించదని బిల్లు వివరిస్తోంది.
 
ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను ఖచ్చితంగా గుర్తించి వారికి చట్ట ప్రయోజనాలు అందేలా స్పష్టమైన నిర్వచనం అవసరమని బిల్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఒక అథారిటీ నియామకం కోసం కూడా నిబంధనలు కల్పించింది.  ఈ అథారిటీగా ప్రధాన వైద్యాధికారి లేదా ఉప ప్రధాన వైద్యాధికారి ఆధ్వర్యంలో ఉన్న మెడికల్ బోర్డును కేంద్రం, రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం నియమించవచ్చని బిల్లులో పేర్కొంది. ట్రాన్స్‌జెండర్ చట్టం అమలు సమయంలో నిర్వచన పరిధిపై సందేహాలు తలెత్తిన నేపథ్యంలో ఈ సవరణలు తీసుకొచ్చినట్లు బిల్లు వివరిస్తోంది. 
 
‘కిన్నర్’, ‘హిజ్రా’, ‘అరవాణి’, ‘జోగ్తా’ వంటి సామాజిక-సాంస్కృతిక గుర్తింపులు కలిగిన వ్యక్తులు, యూనక్స్, ఇంటర్‌సెక్స్ వేరియేషన్స్ ఉన్న వారు లేదా జనన సమయంలో లింగ లక్షణాల్లో సహజ భిన్నత్వం ఉన్నవారిని ట్రాన్స్‌జెండర్‌గా నిర్వచించేలా కొత్త ఉపవిభాగాన్ని చేర్చింది. అలాగే నేరాల తీవ్రత, గాయాల ప్రభావం, ముఖ్యంగా బాలలపై జరిగే నేరాల దృష్ట్యా వేర్వేరు శిక్షలను విధించే విధానాన్ని కూడా బిల్లు ప్రతిపాదించింది.