2025లో అత్యంత కలుషితమైన దేశంగా పాకిస్తాన్

2025లో అత్యంత కలుషితమైన దేశంగా పాకిస్తాన్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేసిన స్థాయి కంటే పీఎం2.5గా పిలువబడే ప్రమాదకరమైన సూక్ష్మ కణాల సాంద్రతలు 13 రెట్లు ఎక్కువగా ఉండటంతో, 2025లో పాకిస్తాన్ ప్రపంచంలోనే అత్యంత పొగమంచు దేశంగా నిలిచిందని మంగళవారం ఒక పరిశోధనలో వెల్లడైంది.  దాని తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్(2), తజికిస్తాన్(3), చాద్(4), కాంగో(5), భారత్(6) ఉన్నాయి.
స్విస్ వాయు నాణ్యత పర్యవేక్షణ సంస్థ ఐక్యూ ఎయిర్  తన వార్షిక నివేదికలో, గత సంవత్సరం 13 దేశాలు, భూభాగాలు సగటు పీఎం2.5 స్థాయిలను డబ్ల్యూహెచ్ఓ ప్రమాణమైన క్యూబిక్ మీటర్‌కు 5 మైక్రోగ్రాముల కంటే తక్కువగా ఉంచాయని, 2024 నాటికి ఈ సంఖ్య ఏడుగా ఉందని పేర్కొంది. మొత్తం 143 పర్యవేక్షించబడిన దేశాలు, భూభాగాలలో, 130 దేశాలు  డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమయ్యాయి. 
ప్రపంచంలోని 10 అత్యంత కాలుష్యమయ నగరాల్లో 5 భారత్‌లోనే ఉన్నాయి. అవి, లోనీ(యూపీ), బైర్నీహట్ (మేఘాలయ), ఢిల్లీ, గాజియాబాద్(యూపీ), ఉలా – బిర్హ్ నగర్ (బంగాల్). ప్రపంచంలోని 25 అత్యంత కాలుష్యమయ నగరాలన్నీ భారత్, పాకిస్థాన్, చైనాలలోనే ఉన్నాయి. నాలుగు అత్యంత కాలుష్యమయ నగరాల్లో మూడు భారత్‌లోనే ఉండటం ఆందోళనకరం. 
 
ఈ సంవత్సరం విడుదల చేసిన నివేదికతో, గత సంవత్సరం విడుదలైన నివేదికను పోల్చి చూస్తే 54 దేశాల గాలిలో పీఎం2.5 మోతాదు గణనీయంగా పెరిగింది. ఇక ఇదే సమయంలో 75 దేశాల గాలిలో పీఎం2.5 మోతాదు తగ్గింది. 2 దేశాల గాలి నాణ్యతలో తేడా ఏమీ రాలేదు. ఈసారి కొత్తగా 12 దేశాల గాలి నాణ్యతా సమాచారాన్ని నివేదికలో కలిపారు.
ఒక ఏడాది వ్యవధిలో గాలిలోని పీఎం2.5 మోతాదు 5 మైక్రోగ్రామ్స్/ క్యూబిక్ మీటర్‌కు మించి పెరగకూడదు అని డబ్ల్యూహెచ్‌ఓ 2021 సెప్టెంబరులో ప్రపంచ దేశాలకు నిర్దేశించింది. కేవలం 14 శాతం ప్రపంచ నగరాల్లోనే ఇందుకు అనుగుణమైన గాలి నాణ్యత ఉందని నివేదిక తెలిపింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే, ఈ గాలి నాణ్యతా ప్రమాణాలను కలిగిన నగరాల సంఖ్య 17 శాతం తగ్గిందని పేర్కొంది.
డబ్ల్యూహెచ్‌ఓ సూచించిన గాలి నాణ్యతా ప్రమాణాలను కేవలం 13 దేశాలు/ప్రదేశాలే అందుకున్నాయని వెల్లడించింది. ఈ జాబితాలో ఫ్రెంచ్ పోలీనేషియా, ప్యుయెర్టో రికో, యూఎస్ వర్జిన్ ఐలాండ్స్, బార్బడోస్, న్యూ సెలిడోనియా, బెర్ముడా, రీయూనియన్, అండోరా, ఆస్ట్రేలియా, గ్రెనడా, పనామా, ఎస్టోనియా ఉన్నాయని పేర్కొంది.
వాతావరణ మార్పుల వల్ల చోటుచేసుకున్న కార్చిచ్చు ఘటనలు గత ఏడాది వ్యవధిలో ప్రపంచ గాలి నాణ్యతను దెబ్బతీశాయని నివేదిక చెప్పింది. ఈ ఘటనలతో కెనడా, అమెరికా, ఐరోపా దేశాలు బాగా ప్రభావితమయ్యాయి. ఐరోపా దేశాలు, కెనడాల్లో రికార్డు స్థాయిలో బయోమాస్ ఉద్గారాలు గాల్లోకి విడుదలయ్యాయి. దీంతో వాతావరణంలోకి 1,380 మెగాటన్నుల కార్బన్లు చేరాయి. 
ఉత్తర అమెరికాలో అత్యంత కాలుష్యమయ దేశంగా కెనడా నిలిచింది. ఈ ర్యాంకును కెనడా పొందడం ఇది రెండోసారి. అమెరికాలోని గాలిలో వార్షిక సగటు పీఎం2.5 మోతాదు 7.3 మైక్రోగ్రామ్స్/ క్యూబిక్ మీటర్‌కు పెరిగింది. అమెరికాలో అత్యంత కాలుష్యమయ నగరంగా ఎల్‌ పాసో నిలిచింది. గాలి నాణ్యత పరంగా అత్యంత స్వచ్ఛమైన అమెరికా నగరంగా సియాటెల్ నిలిచింది. వరుసగా రెండో ఏడాది సియాటెల్‌కే ఈ ర్యాంక్ దక్కింది
 
ఐరోపాలోని 23 దేశాల గాలిలో పీఎం2.5 మోతాదు పెరిగింది. ఇక ఇదే సమయంలో 18 ఐరోపా దేశాల్లో పీఎం2.5 మోతాదు తగ్గింది. ఉత్తర అమెరికాలోని కార్చిచ్చు ఘటనలు, ఆఫ్రికాలోని సహారా ఇసుక తుఫానుల ప్రభావంతో స్విట్జర్లాండ్, గ్రీస్ దేశాల వాతావరణంలో పీఎం2.5 మోతాదు 30 శాతం పెరిగింది. మాల్టా దేశంలో రికార్డు స్థాయిలో 24 శాతం మేర పీఎం2.5 మోతాదు తగ్గింది.