కశ్మీర్ వేర్పాటువాది, దుఖ్తరాన్-ఇ-మిల్లత్ చీఫ్ అసియా అంద్రాబీకి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. శిక్షపై వాదనల అనంతరం అడిషనల్ సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ మంగళవారంనాడు తీర్పు వెలువరించారు. ఈ కేసులో ఇద్దరు సహ నిందితులు సోఫీ ఫమీదా, నహిదా నస్రీన్లకు కోర్టు 30 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
దేశానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొడుతున్నారని, యుద్ధానికి ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలపై కేంద్ర హోం శాఖ ఆదేశాలతో 2018 ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో అసియా అంద్రాబీని ‘ఉపా’ చట్టం కింద అరెస్టు చేశారు. ఆమెతో కలిసి పనిచేస్తున్న అనుచరులు సోఫీ ఫమీదా, నహిదా నస్రీన్‌పై 2021లో కేసు నమోదైంది. ఈ ముగ్గురుని జనవరి 14న కోర్టు ముందు హాజరుపరచగా, ఉపా చట్టంలోని వివిధ సెక్షన్లతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద వీరిని దోషులుగా కోర్టు గుర్తించింది.
ఈ సందర్భంగా నిందితులు ముగ్గురికి కఠిన శిక్ష విధించాలని కోర్టును ఎన్ఐఏ కోరింది. దేశానికి వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడాలనుకునే మిగతావారికి ఈ శిక్ష ఒక సందేశం కావాలని ఎన్ఐఏ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. విచారణ సందర్భంగా దేశం నుంచి జమ్మూ కాశ్మీర్‌ను విడగొట్టేందుకు కుట్రలు పన్నడం, దేశానికి వ్యతిరేకంగా పోరాడటం వంటి నేరాల కింద వీరికి కోర్టు ఈ శిక్ష విధించింది. ఉగ్రవాద సంస్థలతో వీరికి సంబంధాలున్నట్లు తేలింది. నిందితులు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డట్లు ఆరోపించింది.

More Stories
దామాషా పద్దతిలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత పాపారావు
ప్రతి ఇంటికి ఫ్రీ ఫ్రిజ్, మహిళలకు స్కూటీకి రూ.25 వేలు