ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగా యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు-2026ను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ యూసీసీ అమలుపై తుది నివేదికను సమర్పించిన వారం రోజుల తర్వాత ఈ బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకురావడం గమనార్హం.
గుజరాత్ అసెంబ్లీలో ఈ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై చర్చించి, అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ‘గుజరాత్ యూనిఫాం సివిల్ కోడ్, 2026’ కనుక ఆమోదం పొందితే, దేశంలో యూసీసీ బిల్లును ఆమోదించిన రెండో రాష్ట్రంగా గుజరాత్ నిలుస్తుంది. 2024 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ సర్కార్ మొదటసారిగా ఈ బిల్లును ఆమోదించింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలులో ఉంది.
ఉమ్మడి పౌరస్మృతి బిల్లు కనుక ఆమోదం పొందితే, మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవన సంబంధాలు నియంత్రించడానికి ఒక ఉమ్మడి చట్టం అమల్లోకి తీసుకురావచ్చు. మరీ ముఖ్యంగా ఇది సహజీవన సంబంధాలను నమోదు చేసుకోవడానికి, అలాగే అధికారిక ప్రకటన చేసి, వాటిని రుద్ద చేసుకోవడానికి వీలుకల్పిస్తుంది.
వాస్తవానికి ఈ బిల్లు బహుభార్యత్వాన్ని నిషేధిస్తుంది. వివాహ సమయంలో వధూవరులు ఇద్దరికీ బతికి ఉన్న జీవిత భాగస్వామి లేకపోతేనే, ఆ పెళ్లి చట్టం ప్రకారం చెల్లుబాటు అవుతుంది. ఈ ఉమ్మడి పౌరస్మృతి బిల్లు కనుక ఆమోదం పొందితే, అది గుజరాత్ రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది. అంతేకాదు రాష్ట్రం వెలుపల నివసించే గుజరాతీలు కూడా దీని పరిధిలోకి వస్తారు. కానీ, ఇది షెడ్యూల్డ్ తెగలకు, రాజ్యాంగం ప్రకారం, సంప్రదాయ హక్కులకు రక్షణ కలిగి ఉన్న కొన్ని సమూహాలకు వర్తించదు.

More Stories
దామాషా పద్దతిలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత పాపారావు
ప్రతి ఇంటికి ఫ్రీ ఫ్రిజ్, మహిళలకు స్కూటీకి రూ.25 వేలు