హైదరాబాద్ నగర జనాభా మరియు వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనమండలిలో ప్రకటించారు. ఇందులో భాగంగా నగరాన్ని క్యూర్ , ప్యూర్, రేర్ అనే మూడు ప్రత్యేక జోన్లుగా విభజిస్తున్నట్లు వెల్లడించారు. మానవ తప్పిదాల వల్లే ఇవాళ అనేక సమస్యలు వస్తున్నాయని చెప్పారు.
ఆదాయ మార్గాలు పెరిగి ప్రతి కుటుంబంలో కార్లు పెరిగాయని, ట్రాఫిక్ రద్దీ పెరగడం వల్లే మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరించుకున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు భారీ ఎలివేటెడ్ కారిడార్లు, అండర్‌పాస్‌లు, సర్ఫేస్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మెట్రో రైలు విస్తరణలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ అండ్ టీ సంస్థ ముందుకు రాకపోవడంతో, కేంద్ర నిబంధనల ప్రకారం రూ. 15 వేల కోట్లతో మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
త్వరలోనే మరో 76 కిలోమీటర్ల మేర మెట్రో లైన్లను విస్తరించబోతున్నట్లు సీఎం భరోసా ఇచ్చారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలిస్తామని, రోడ్లను అండర్ పాస్‌లు, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్లుగా విభజించామని, ఎక్కడా ట్రాఫిక్ ఆగకూడదనేదే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర శివార్ల నుంచి వచ్చే ఉద్యోగుల సంఖ్య బాగా పెరిగిందన్న ఆయన, మెట్రో విస్తరణపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని తెలిపారు.
శామీర్‌పేట, మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామని, దానికోసం కేంద్ర సంస్థలతో మాట్లాడి భూమి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పైన విమానాలు ఎగిరితే, కింద అండర్ టన్నెల్ వచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నగర సుందరీకరణలో భాగంగా మూసీ నది పునరుజ్జీవనంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మూసీని గత వైభవానికి తీసుకువస్తామని రేవంత్ రెడ్డి వివరించారు.
దీనితో పాటు, దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ‘ఫ్యూచర్ సిటీ’ ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని, గతంలో గుజరాత్ అభివృద్ధి కోసం అన్ని పార్టీలు ఎలాగైతే కలిశాయో, హైదరాబాద్ అభివృద్ధి కోసం కూడా ప్రతిపక్షాలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు ఇబ్బందులు ఉన్నాయని, వాహనాలు సిగ్నల్స్ వద్ద ఆగకుండా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగిస్తున్నామని, అక్కడ ఉన్న చిరు వ్యాపారులకు ఇతర చోట్ల స్థలం కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో పలుచోట్ల మల్టీ లెవల్ కారు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని, హిల్ట్ పాలసీ కింద పరిశ్రమలకు వినియోగ మార్పిడీ చేస్తున్నట్లు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే దిల్లీ మాదిరిగా హైదరాబాద్ లో కాలుష్యం పెరిగిపోతుందని చెప్పారు. ఓఆర్ఆర్ లోపల పలుచోట్ల రేడియల్ రోడ్లు వేస్తున్నట్లు పేర్కొన్నారు.
దూరం తగ్గించేందుకు ఎలివేటెడ్ కారిడార్లు వేస్తున్నామన్న సీఎం, సిటీ మధ్య నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్లేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్ల వల్ల హైదరాబాద్ అద్భుత నగరంగా మారుతుందని చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థను మారిస్తే మూసీ సుందరీకరణ త్వరగా పూర్తవుతుందని చెప్పారు. ప్యూర్ రీజియన్‌లో పరిశ్రమలు ఉంటాయని, ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నామని, క్యూర్లో సర్వీస్ సెక్టార్, ప్యూర్‌లో ఇండస్ట్రియల్ సెక్టార్, రేర్‌లో అగ్రికల్చర్ సెక్టార్లు వస్తాయని వివరించారు.

More Stories
అస్సాంలో హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తున్న బీజేపీ!
లోక్‌సభలో 816 సీట్లకు పెంపు, మహిళలకు 273
రైతు రుణమాఫీ ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో లేదు