తమిళనాడులో ఎన్డీయే సీట్ల ఒప్పందం ఖరారు

తమిళనాడులో ఎన్డీయే సీట్ల ఒప్పందం ఖరారు

* ఏఐఏడీఎంకే 178, బీజేపీ 27 సీట్లలో పోటీ

త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం సీట్ల ఒప్పందాన్ని ఎన్డీయే ఖరారు చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను 178 స్థానాల్లో అన్నాడీఎంకే, 27 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నాయి. కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలైన అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పీఎంకేకు 18, టీటీవీ దినకరన్‌కు చెందిన ఏఎంఎంకేకు 11 సీట్లు కేటాయించారు.

2021లో 20 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీకి, ఈసారి 27 స్థానాలను కేటాయించారు. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ (28 సీట్లు) కంటే బీజేపీకి ఒక సీటు మాత్రమే తక్కువ దక్కడం గమనార్హం. కూటమిలోని  పీఎంకే వాటా గణనీయంగా తగ్గింది. గతంలో 23 స్థానాల్లో పోటీ చేసిన ఈ పార్టీకి ఇప్పుడు 18 సీట్లు మాత్రమే కేటాయించారు.  పీఎంకే కోటా నుంచి తగ్గిన 5 సీట్లు నేరుగా బీజేపీకి బదిలీ అయినట్లు తెలుస్తోంది.

దినకరన్ నేతృత్వంలోని పార్టీకి 11 స్థానాలు కేటాయించారు.  ఈ సందర్భంగా సోమవారం ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి (ఈపీఎస్‌) మాట్లాడుతూ సీట్ల పంపకం చర్చలు సజావుగా సాగాయని, అధికారికంగా ఏయే పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో నిర్ణయించామని తెలిపారు. తమ కూటమిలో ఇతర పార్టీలకు ఇవ్వాల్సిన స్థానాలపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.

సీట్ల కేటాయింపులు అధికారికంగా ఖరారయ్యాయని చెప్పారు.  ఎన్డీయేను ‘విజయ కూటమి’గా ఆయన అభివర్ణించారు. అన్ని సీట్లలో విజయం సాధించి, ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.  ఇదిలా ఉండగా రానున్న ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీ కమలం గుర్తుతోనే తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సముఖంగా ఉందని పట్టలి మక్కల్‌ కట్చి వ్యవస్థాపకుడు ఏసీ శణ్ముగం తెలిపారు.

మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు డీఎంకే-కాంగ్రెస్ కూటమిని తిరస్కరిస్తారని బీజేపీ తమిళనాడు ఇన్‌చార్జ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మహారాష్ట్ర, హర్యానా, బీహార్, ఢిల్లీలో మాదిరిగానే తమిళనాడు ఓటర్లు ఎన్డీయేను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడును అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టిన దుష్ట శక్తి అయిన డీఎంకే, దాని భాగస్వాములకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.