ఉత్సాహంగా రాష్ట్రవ్యాప్తంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం

ఉత్సాహంగా రాష్ట్రవ్యాప్తంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం

* ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా నాంది
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా విద్యారంభ వేదికల సాక్షిగా ప్రారంభమైన సామూహిక  అక్షరాభ్యాస కార్యక్రమం స్వచ్ఛందంగా రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహ భరితంగా కొనసాగుతోంది. మార్చి 19న ప్రారంభమైన ఈ క్రతువు సోమవారం వరకు కొనసాగనున్నది.రాష్ట్రంలోని అనేక హిందూ దేవాలయాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు వారి పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇప్పటికే వేలాది చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు.
 
బడుగు, బలహీన వర్గాలకు చెందిన బాల బాలికలకు విద్యపై ఆసక్తి కల్పించడం, వారినీ అక్షరానికి చేరువ గా తీసుకుని వెళ్ళు శుభారంభం ఈ  వేడుకల ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు.ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి హైందవుడు కనీసం ఐదుగురు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి వారి భవిష్యత్తుకు పునాది వేయాలని పిలుపునిచ్చారు.

రాబోయే విద్యా సంవత్సరం దృష్టి లో ఉంచుకుని, బడి ఈడు బాల బాలికలకు ఆ ఆ లు దిద్ధించి ఆశీర్వదించాల్సిందిగా పెద్దలను కోరారు. మన సంప్రదాయంలో అక్షరాభ్యాసం కూసు విద్య  అంటారని చెబుతూ ఈ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు .

  “సామాజిక సమగ్రత స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో స్థానిక కమ్యూనిటీలు, ఆలయ అర్చకులు, స్వచ్ఛంద సంస్థలు,వేద పాఠశాలలు, వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఈ కార్యక్రమం విస్తృతంగా జరుగుతోంది” అని స్టేట్ కో-ఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ, రాబోయే మే, జూన్ నెలల్లో చిన్నారులను పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రోత్సహిస్తున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు తరుపున దేవాలయాలను కేంద్రంగా చేసుకుని విద్యా దానాన్ని విస్తరించే ఈ ప్రయత్నం సమాజంలో మంచి మార్పు రావాలని ధార్మిక ప్రముఖులు ఆశిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో కొనసాగుతున్న ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం, ఇప్పటికే విశేష స్పందనతో విజయవంతమైన కార్యక్రమంగా నిలుస్తోంది.