హర్మూజ్‌ జలసంధి దగ్గర భారత వాణిజ్య నౌక కెప్టెన్‌ మృతి

హర్మూజ్‌ జలసంధి దగ్గర భారత వాణిజ్య నౌక కెప్టెన్‌ మృతి
హర్మూజ్‌ జలసంధి సమీపంలో నిలిచిన భారత వాణిజ్య నౌకలో కెప్టెన్‌గా విధి నిర్వహణలో ఉన్న ఒక భారతీయుడుమృతిచెందాడు. చమురుతో భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకకు అతను కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ నౌకా కెప్టెన్‌కు గుండెపోటు రావడంతో మరణించినట్లు అతడి కుటుంబసభ్యులు తెలిపారు.  ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు సాయం చేయాలని కుటుంబసభ్యులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
జార్ఖండ్‌ రాజధాని రాంచీకి చెందిన రాకేశ్‌ రంజన్‌ (43) ‘అవానా’ చమురు నౌకకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ నౌక భారత్‌కు బయలుదేరింది. అయితే యుద్ధం నేపథ్యంలో ఇది హర్మూజ్‌కు 14 నాటికల్‌ మైళ్ల దూరంలో చిక్కుకుపోయింది.  ఈ క్రమంలో ఈనెల 18న రంజన్‌ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వైద్య సాయం అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఉద్రిక్తతల నేపథ్యంలో అతడిని విమానంలో తరలించేందుకు అనుమతులు లభించలేదు.
ఈ క్రమంలో పడవలో దుబాయ్‌లోని పోర్ట్‌ రషీద్‌కు తరలించారు. అక్కడ రంజన్‌ ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటు కారణంగా రంజన్‌ మృతిచెందినట్లు చెప్పారు. అయితే పోస్టుమార్టం తర్వాతే నైకా కెప్టెన్ మృతికిగల కచ్చితమైన కారణాలు తెలియనున్నాయి. ఇక, రంజన్‌ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందించాలని కుటుంబసభ్యులు విజ్ఞప్తిచేశారు.
ఈ మేరకు జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, రాంచీ ఎంపీ సంజయ్‌ సేథ్‌లకు లేఖలు రాసినట్లు మృతుడి సోదరుడు వెల్లడించారు. రంజన్‌కు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. గత 24 గంటలుగా  హర్మూజ్‌ జలసంధి  మార్గంలో క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. అదే సమయంలో భారత్​కు చెందిన రెండు ఎల్పీజీ ట్యాంకర్లు ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో భారత్‌కు చెందిన 22 నౌకలు ఉన్నట్లు సమాచారం. వీటి సురక్షిత రాకపోకలకు చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. “భారత నౌకలు సురక్షితంగా, అడ్డంకుల్లేకుండా ప్రయాణించేందుకు మేము కట్టుబడి ఉన్నాం” అని విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి అంతర్జాతీయ నాయకులతో కూడా ఈ అంశంపై సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.
అధికారులు న్యాయ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ, సెలవులు, ఇతర విధానాల కారణంగా జాప్యం కొనసాగుతోంది. అస్థిరమైన అంతర్జాతీయ జలాల్లో పనిచేస్తున్న భారతీయ నావికులు ఎదుర్కొంటున్న ప్రమాదాలను ఈ ఘటన మరోసారి ఎత్తిచూపుతోంది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని అతని కుటుంబం ఇప్పుడు కోరుతోంది.