హిందూ మ‌హాస‌ముద్రంలోని అమెరికా బేస్‌పై ఇరాన్ క్షిప‌ణి దాడులు

హిందూ మ‌హాస‌ముద్రంలోని అమెరికా బేస్‌పై ఇరాన్ క్షిప‌ణి దాడులు

None

ఇరాన్‌, అమెరికా మ‌ధ్య యుద్ధం ఖండాలు దాటింది. హిందూ మ‌హాస‌ముద్రం దిశ‌గా ఆ యుద్ధం వెళ్తోంది. ఆ స‌ముద్రంలోని చాగోస్ దీవుల్లో ఉన్న అమెరికా-యూకే మిలిట‌రీ బేస్ డీగో గార్సియాపై ఇరాన్ తాజాగా రెండు బాలిస్టిక్ క్షిప‌ణుల‌ను ఫైర్ చేసిన‌ట్లు తెలిసింది.   హిందూ మహాసముద్రంలోని యూఎస్-యూకే సైనిక స్థావరం డియెగో గార్సియాపై ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని సెమీ-అధికారిక మెహర్ వార్తా సంస్థ శనివారం నివేదించింది.

అంతకుముందు, ఇరాన్ ఆ స్థావరం వైపు రెండు మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని, అయితే అవి దానిని తాకలేదని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఓ క్షిప‌ణి మార్గ‌మ‌ధ్యంలోనే విఫ‌లమైందని, మ‌రో మిస్సైల్‌ను ఇంట‌ర్‌సెప్టార్ కూల్చివేసిన‌ట్లు మీడియా క‌థ‌నం ద్వారా తెలుస్తోంది.   ఇరాన్ భూభాగానికి సుమారు 4 వేల కిలోమీట‌ర్ల దూరంలో ఛాగోస్ దీవులు ఉన్నాయి.
చాలా దూరం ఉన్న అమెరికా బేస్‌ను ఇరాన్ టార్గెట్ చేసిన‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నా  దాంట్లో వాస్త‌వం ఎంతో తెలియ‌డం లేదు.  ఒక‌వేళ ఇదే నిజం అయితే అప్పుడు యూరోప్‌లోని బేస్‌ల‌ను కూడా ఇరాన్ టార్గెట్ చేసే రేంజ్‌లో ఉన్న‌ట్లు అనుమానించ‌వ‌చ్చు.  ఈ దాడి ఇప్పుడు, తాను ప్రకటించిన సామర్థ్యాలకు మించి లక్ష్యాలపై దాడి చేయగల ఇరాన్ సామర్థ్యంపై అమెరికా, దాని మిత్ర దేశాలలో ఆందోళనను రేకెత్తిస్తోంది.
ముఖ్యంగా, ఒక లక్ష్యంపై దాడి చేయడానికి తమ గరిష్ట పరిమితి 2,000 కిలోమీటర్లు అని టెహ్రాన్ గతంలో పేర్కొంది. ఇరాన్ తన క్షిపణి పరిధిని ఉద్దేశపూర్వకంగానే 2,000 కిలోమీటర్లకు పరిమితం చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి గతంలో తెలిపారు.  అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ క్షిప‌ణి దాడి గురించి పెంట‌గాన్ ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. 
హిందూ మ‌హాస‌ముద్రం మ‌ధ్య భాగంలో ఉన్న డీగో గార్సియా దీవుల‌ను ఇరాన్ టార్గెట్ చేసిన‌ట్లు వ‌స్తున్న వార్త‌లు నిజ‌మైతే, అప్పుడు ఈ యుద్ధం హ‌ద్దులు దాటిన‌ట్లు అవుతుంద‌ని, ఇదొక ర‌కంగా ప‌శ్చిమ దేశాల‌కు బ‌లమైన సంకేత‌మే అని మాజీ కేంద్ర మంత్రి మ‌నీష్ తివారీ త‌న ఎక్స్‌లో పేర్కొన్నారు.  గ‌తంలో ఆఫ్ఘ‌నిస్తాన్, ఇరాక్‌పై దాడులు చేప‌ట్టిన‌ప్పుడు డీగో గార్సియా బేస్‌ను అమెరికా వాడుకున్న‌ది.
వాస్త‌వానికి ఇది బ్రిట‌న్ బేస్‌. కానీ ప‌శ్చిమాసియాలో ఏదైనా ఆప‌రేష‌న్ చేప‌ట్టిన‌ప్పుడు అమెరికా ఈ బేస్‌ను వినియోగిస్తున్న‌ది. ఇటీవ‌ల త‌మ బీ-2 యుద్ధ విమానాల‌ను ఈ బేస్‌లో అమెరికా మోహ‌రించిన‌ట్లు తెలుస్తోంది. మధ్య బ్రిటిష్ హిందూ మహాసముద్ర భూభాగంలోని చాగోస్ ద్వీపసమూహంలో, డియెగో గార్సియా అతిపెద్ద ద్వీపం. 1971లో అమెరికా,  బ్రిటన్ ఈ ద్వీపంలో ఒక భారీ సైనిక స్థావరాన్ని నిర్మించాయి.
అప్పటి నుండి ఇది సుదూర శ్రేణి బాంబర్ విమాన కార్యకలాపాలు, అణు జలాంతర్గాములు, గైడెడ్-క్షిపణి విధ్వంసక నౌకలకు ఒక కీలకమైన ముందస్తు స్థావరంగా సేవలు అందిస్తోంది. ఇరాక్‌పై రెండు దండయాత్రలను ప్రారంభించడానికి,  ఆసియా అంతటా బాంబర్ విమాన మిషన్లను నిర్వహించడానికి ఈ స్థావరాన్ని ఉపయోగించారు.