ఒక మహిళపై అత్యాచారం చేసి, అనేక మందిని లైంగికంగా దోపిడీ చేసినందుకు అరెస్టు అయిన స్వీయ-ప్రకటిత ఆధ్యాత్మిక గురువు, జ్యోతిష్కుడు అశోక్ ఖరత్‌తో సంబంధాలున్నాయనే వివాదం నేపథ్యంలో, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కోరడంతో మహారాష్ట్ర రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రూపాలి చకన్కర్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు.
ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్‌తో సమావేశమైన అనంతరం చకన్కర్ తన పదవికి రాజీనామా చేశారు. ఫడ్నవిస్‌కు రాసిన తన రాజీనామా లేఖలో ఆమె ఇలా పేర్కొన్నారు: “నా వ్యక్తిగత కారణాల వల్ల, నేను ఈ పదవికి రాజీనామా సమర్పిస్తున్నాను. మీరు ఇప్పటివరకు నాకు అందించిన విలువైన సహకారానికి నేను మీకు కృతజ్ఞురాలిని. మీ మద్దతుకు మీకు, మీ సహోద్యోగులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా మీ సహకారం కొనసాగుతుందని నేను నమ్ముతున్నాను.”
‘కెప్టెన్ ఖరత్’గా కూడా పిలువబడే ఖరత్‌తో ఆమె ఉన్న ఫోటోలు, ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుండి చకన్కర్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఖరత్‌ను పదవి నుండి తొలగించాలని లేదా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. శుక్రవారం, ఖరత్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ పూణేలో కూడా ఒక నిరసన కార్యక్రమం నిర్వహించారు.
అన్యాయానికి గురైన మహిళలకు చకన్కర్ న్యాయం అందించాలి, కానీ దానికి బదులుగా ఆమె అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి పాదాలు కడుగుతున్నారని శివసేన (యూబీటీ) సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ విమర్శించారు. ఇదిలా ఉండగా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తున్న చకన్కర్, ఖరత్‌ను సమర్థించారని సామాజిక కార్యకర్త అంజలి దమానియా ఆరోపించారు.
అయితే, చకన్కర్ తనపై ఉన్న అన్ని ఆరోపణలను ఖండించారు. జ్యోతిష్కుడు అశోక్ ఖరత్‌తో తన సంబంధం పరిమితమని, ఆయనపై ఆరోపించిన నేరాల గురించి తనకు ఏమీ తెలియదని రూపాలి తెలిపారు. సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా ఎలాంటి నిర్ధారణలకు రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. చట్టం దాని పనిని అది చేసుకునేందుకు అనుమతించాలని కోరారు.
“ప్రస్తుత ఆరోపణల విషయానికొస్తే, పోలీసులు నిష్పక్షపాతంగా, న్యాయంగా విచారణ జరుపుతారని నేను నమ్మకంగా ఉన్నాను. పోలీసుల విచారణపై నాకు పూర్తి విశ్వాసం ఉంది,” అని ఆమె రెండు రోజుల క్రితం ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరోవైపు అశోక్ ఖరత్, ఆయన ట్రస్ట్‌తో ఆమెకు ఉన్న సంబంధంపై విచారణ జరుపాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి యోగేష్ కదమ్ దీనిపై స్పందిస్తూ ‘ఇవి రెండు వేర్వేరు అంశాలు. లైంగిక వేధింపుల కేసు విచారణలో ఉన్నది. దానిని క్షుణ్ణంగా విచారిస్తాం. ట్రస్టీగా ఆమె పాత్రలో ఏదైనా చట్టవిరుద్ధం ఉంటే దానిని కూడా పరిశీలిస్తాం’ అని మీడియాతో పేర్కొన్నారు.
కాగా, పదవీ విరమణ పొందిన మర్చంట్ నేవీ అధికారి అశోక్ ఖరత్ ప్రముఖ జ్యోతిష్యుడిగా ప్రసిద్ధి చెందాడు. 35 ఏళ్ల మహిళపై మూడేళ్లకు పైగా పలుమార్లు అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై బుధవారం నాసిక్ జిల్లాలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్‌లో 58 మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోలు గుర్తించారు. ఆధ్యాత్మిక ముసుగులో మహిళలను లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతన్ని ఇప్పుడు అరెస్టు చేసి, మార్చి 24 వరకు పోలీసు కస్టడీకి రిమాండ్ చేశారు.

More Stories
`భారత్ లో మతపరమైన హింస’ నివేదిక అమెరికాకే గొడ్డలిపెట్టు!
విశ్వవ్యాప్తంగా ప్రతిష్ట పొందలేకపోతున్న భారతీయ వంటకాలు
పశ్చిమాసియాలో సైనిక చర్య తగ్గింపు దిశగా అమెరికా