వ్యక్తి నిర్మాణంతో వసుదైక కుటుంబమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం 

వ్యక్తి నిర్మాణంతో వసుదైక కుటుంబమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం 
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యక్తి నిర్మాణంతో దేశ అభ్యున్నతికి, తద్వారా వసుదైవ కుటుంబాన్ని సాధించే లక్ష్యంతో పనిచేస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు.  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా విజయవాడలో గురువారం సాయంత్రం జరిగిన ఉగాది ఉత్సవంలో  ముఖ్యఅతిథిగా పాల్గొంటూ గడిచిన గత 100 సంవత్సరాల్లో అనేక సంస్థలను స్థాపించినా వీటిలో చాలా సంస్థలు నేడు కనుమరుగయ్యాయని గుర్తు చేశారు.
 
అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ సంస్థ దేశ సేవలో సదా నిమగ్నమై ఉన్నదని ఆయన చెప్పారు దివిసీమలో జరిగిన ఉప్పెన సందర్భంగా సంఘ్  స్వయం సేవకులు చేసిన సేవా కార్యక్రమాలు ఎందరినో సంఘ్ వైపు ఆకర్షింప చేస్తున్నాయని తెలిపారు. తాను సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అనేక  రాజ్యాంగ పదవులను అధిరోహిస్తూ రాజ్యాంగంలో ఉన్నత పదవైన  ఉపరాష్ట్రపతి పదవి దాకా చేరుకున్నానని చెప్పారు.  
 
అది కేవలం రాష్ట్రీయ సంఘ్ చలువేనని గర్వంగా చెప్పుకోగలుగుతున్నానని తెలిపారు. ఈరోజు దేశంలో వార్డ్ మెంబర్ స్థాయి నుంచి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి స్పీకర్ ప్రధానమంత్రి వరకు అనేకమంది సంఘ కార్యకర్తలుగా ఉన్నవాళ్లే దేశ సేవలో నిమగ్నమై ఉన్నారని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. ఈ విధంగా దేశంలోని అన్ని రంగాల్లో సంఘం పనిచేస్తుందని చెప్పారు. సంఘానికి నిస్వార్ధంగా పనిచేసే యువత కావాలని పేర్కొంటూ  అలాంటి యువతను తయారు చేసేవిధంగా సంఘ్ కార్యక్రమాలు ఉన్నాయని తెలియజేశారు.
 
ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీరామ్ భరత్ కుమార్ ముఖ్య వక్తగా పాల్గొంటూ ఈ శతాబ్ది ఉత్సవాలలో ఆర్ఎస్ఎస్ ప్రవచించినటువంటి పంచ పరివర్తనల గురించి వివరించారు. స్వదేశీ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, పౌర విధులు వీటి గురించి వివరిస్తూ స్వయం సేవకులు అందరూ ఈ నియమాలను పాటిస్తే సమాజ పరివర్తన అతి సులభంగా జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
 
ఆ దేశంలో దేశం తిరిగి పరమ వైభవ స్థితికి చేరుకోవటానికి ఎక్కువ కాలం పట్టదని చెబుతూ యువత ఆ దిశగా ప్రయత్నం చేయాలని వివరించారు కార్యక్రమం అనంతరం సుమారు 1700 మంది స్వయంసేవక్ లు నిర్వహించిన పధ సంచలనం (రూట్ మార్చ్) విశేషంగా ఆకట్టుకుంది. ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలాక్ కోనేరు దుర్గా ప్రసాద్, నగర సంఘచాలక్, ప్రముఖ ఆడిటర్   కృష్ణ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.