పశ్చిమాసియాలో చమురు, గ్యాస్ క్షేత్రాలపై జరుగుతున్న దాడులు, గ్లోబల్ స్థాయిలో భారీగా పెరిగిన ఇంధన ధరలు, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వెరసి గురువారం భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. వరుసగా మూడు రోజుల పాటు లాభాల్లో కొనసాగిన సూచీలు అంతర్జాతీయ ప్రతికూలత ధాటికి కుప్పకూలాయి. సెన్సెక్స్ 2,500 పాయింట్లు, నిఫ్టీ 800 పాయింట్లపైగా పడిపోయాయి. దీంతో గురువారం ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లకుపైగా సంపద ఆవిరి అయ్యింది.
ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 2,580 పాయింట్ల నష్టపోయి 74,123 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 808 పాయింట్లు కోల్పోయి 22,972 వద్ద వద్ద ట్రేడ్ అవుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందనే ఆందోళనలతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరిగింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 116 డాలర్లకు చేరుకుంది. క్రూడ్ ఆయిల్ విషయంలో భారత్ దిగుమతులపైనే ఆధారపడి ఉంది. దీంతో భారతీయ మార్కెట్‌పై ఆ సెంటిమెంట్ భారీగా పడింది.
మరోవైపు దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చైర్మన్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీంతో ఆ బ్యాంక్ షేర్లు 3 శాతానికి పైగా పడిపోయాయి. అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 49 పైసలు కోల్పోయి 92.89 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు అమెరికా మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఆ ప్రభావం గురువారం ఉదయం ఆసియా మార్కెట్లపై పడింది. దీంతో ఆసియా మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి. దక్షిణ కొరియాకు చెందిన కోస్సీ 1.55శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 2.18శాతం , షాంఘైకు చెందిన ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ సూచీ 1.68 శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
ఇక అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. నాస్డాక్ మినహా మిగతా అన్ని సూచీలు పడిపోయాయి. ఇదే సమయంలో ఇరాన్ – అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరిచుకుంటున్నారు. బుధవారం ఒక్కరోజే రూ. 2,714.35 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మంగళవారం రూ.4,741 కోట్లు, సోమవారం రూ.9వేల కోట్లకు పైగా, శుక్రవారం అత్యధికంగా రూ.10వేల కోట్లకు పైగా విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

More Stories
యుద్ధాన్ని వ్యాపారంగా మార్చుకున్న వైట్‌హౌస్
బలం పుంజుకున్న భారత్ రూపాయి
రెపో రేటు యథాతథంగా 5.25 శాతం