యుద్ధం 18వ రోజుకు చేరుకున్నప్పటికీ పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడులు ఆగడం లేదు. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని షా గ్యాస్ క్షేతం లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో అక్కడ పెద్దయెత్తున మంటలు చెలరేగడంతో కార్యకలాపాలను ఆపేశారు. విపత్తు నివారణ బృందాలు రంగంలోకి దిగి అతి కష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు.
కాగా, ఈ దాడిలో ఎవరూ గాయపడ లేదని అక్కడి అధికారులు తెలిపారు. గ్యాస్ క్షేత్రంపై దాడితో పెద్దయెత్తున మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగ వ్యాపించిందని స్థానికులు తెలిపారు. కాగా, యూఏఈ తూర్పు తీరంలో పుజైరా సమీపంలోని ఒమన్ గల్ఫ్‌లో జరిగిన ఈ దాడిలో ఆ నౌక స్పల్పంగా దెబ్బతిందని యూకే మారిటైమ్ ట్రేడ్ అపరేషన్స్ పేర్కొంది.
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతూ ఇరాన్ చుట్టూ అమెరికా యుద్ధనౌకలను మోహరించిన తరుణంలో అణుశక్తితో నడిచే ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. మంటలను ఆర్పేందుకు 30 గంటలకు పైగా సమయం పట్టిందని, నౌకలోని దాదాపు 600 మంది నావికులు, సిబ్బందికి నిద్రించడానికి పరుపులు కూడా లేకుండా పోయాయని కూడా పత్రిక పేర్కొంది.
నౌకలోని ప్రధాన లాండ్రీలో మంటలు రాజుకున్నాయని, అక్కడి నుంచి నౌకలోని ఇతర భాగాలకు విస్తరించాయని తెలిపింది. అయితే మంటలకు కారణం తెలియరానప్పటికీ నౌకకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నదని సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ ఘటనలో ముగ్గురు నావికులు గాయపడ్డారు. ఈ యుద్ధనౌకలో 4,500 మంది నావికులు, ఇతర సిబ్బంది ఉండే సామర్థ్యం ఉన్నది.
కాగా, అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఖండించాల్సిందిగా ప్రపంచ శాంతి, భద్రతను కోరుకుంటున్న దేశాలు, సంస్థలన్నింటినీ కోరుతూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తన టెలిగ్రాఫ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. హర్మూజ్ జలసంధిలో ఎదురవుతున్న అడ్డంకులను ఏ ఒక్క దేశం స్వతంత్రంగా తొలగించలేదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు ఆయన సూచించారు.

More Stories
కాల్పుల విరమణకు మొజ్తాబా ఖమేనీ తిరస్కారం!
ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే ఇరాన్‌పై దాడి
ఇరాన్ భద్రతా మండలి అధిపతి అలీ లారిజానీ హతం!