కాల్పుల విరమణకు మొజ్తాబా ఖమేనీ తిరస్కారం! 

కాల్పుల విరమణకు మొజ్తాబా ఖమేనీ తిరస్కారం! 

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేలా కాల్పుల విరమణకు సంబంధించి రెండు మధ్యవర్తిత్వ దేశాలు చేసిన ప్రతిపాదనలను తమ  నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని తిరస్కరించారని ఓ ఇరాన్ సీనియర్ అధికారి వ్యాఖ్యలను ఉటంకిస్తూ రాయిటర్స్ కథనం వెలువరించింది. సుప్రీం లీడర్‌గా ఎన్నికైన తర్వాత విదేశాంగ విధానంపై నిర్వహించిన తన తొలి సమావేశంలో అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్న కఠిన వైఖరిని ఖమేనీ వ్యక్తం చేశారని ఆ అధికారి పేర్కొన్నట్టు తెలిపింది.

అయితే, ఆ సమావేశాలకు ఖమేనీ స్వయంగా హాజరయ్యారా? లేదా? అనేది మాత్రం ఆయన స్పష్టం చేయలేదని పేర్కొంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఆస్తులను ఇరాన్ లక్ష్యంగా చేసుకుని డ్రోన్, స్ఖఈపనులతో దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇరాన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం యుద్ధం ముదురుతున్న వేళ రెండు దేశాలతో కాల్పుల విరమణ, ఉద్రిక్తతలు తగ్గించే అంశంపై ఇరాన్ నేతలు ఖమేనితో చర్చలు జరిపారు.

ఉద్రిక్తతలు తగ్గించి, శాంతి, కాల్పుల ఒప్పందం వంటి అంశాల్లో రెండు దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనల్ని ఇరాన్ నేతలు ఆయన ముందుంచారు. కానీ, ఖమేని మాత్రం వాటిని తిరస్కరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌ తమ ఓటమిని అంగీకరించి, నష్ట పరిహారాన్ని చెల్లించి తమ ముందు మోకరిల్ల చేసేవరకు శాంతికి ఇది తగిన సమయం కాదని మొజ్తాబా స్పష్టం చేసినట్లు ఆ అధికారి చెప్పారు.

ఇప్పటివరకు పరిమిత స్థాయిలోనే ప్రతీకార చర్యలకు దిగామని, అనుకున్నది సాధించేవరకు తమ చర్యలు కొనసాగుతాయని, అంతవరకు ఇది తమ ప్రాధాన్యంగా ఉంటుందని అయన స్పష్టం చేశారు. ఇరాన్ ఎప్పటికీ వెనకడుగు వేయదని, ఎప్పటికీ ప్రతిఘటిస్తూనే ఉంటుందని ఖమేని తేల్చి చెప్పారు. అయతొల్లా ఖమేని మరణానికే కాదని, ప్రతి ఇరాన్ పౌరుడి మరణానికి పూర్తి శక్తి సామర్ధ్యాలతో ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశా రు.
అయితే, ప్రస్తుతం ఖమేని ఎక్కడ ఉన్నారనేదానిపై స్పష్టత లేదు. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల్లో తీవ్రంగా గాయపడిన మోజ్తాబా ఖమేనీ ప్రస్తుతం రష్యాలో చికిత్స పొందుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వ్లాదిమిర్ పుతిన్ చికిత్స కోసం మోజ్తాబాను మాస్కో‌కు తరలించాలని ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజిష్కియాన్‌కు ఫోన్ చేసి చెప్పినట్టు కువైట్ పత్రిక అల్-జరీదా నివేదించింది.  పుతిన్ కాల్ తర్వాత గురువారం ఆయనను రష్యా సైనిక విమానంలో మాస్కోకు తరలించినట్టు పేర్కొంది.
అయితే, ఈ నివేదికలను రష్యా తిరస్కరించనూ లేదా ఖండిచనూ లేదు. ఇటువంటి వాటిపై తాము మాట్లాడబోమని రష్యా అధ్యక్షుడు ప్రెస్ సెక్రెటరీ దిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యానించారు. కాగా, అమెరికా యుద్ధానికి సైనిక దళాలను తమ భూభాగం పైకి పంపితే కొత్త వియత్నాంను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి సయీద్‌ ఖటీబ్‌జాదే హెచ్చరించారు. ఈ ఘర్షణను శాశ్వతంగా ముగించే ప్రతిపాదనతో ముందుకు రావాల్సిన బాధ్యత అమెరికా, దాని మిత్ర దేశాలదేనని ఆయన స్పష్టం చేశారు.