ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే ఇరాన్‌పై దాడి

ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే ఇరాన్‌పై దాడి
* రాజీనామా చేస్తూ అమెరికా జాతీయ ఉగ్ర నిరోధక విభాగం డైరెక్టర్‌ జోసెఫ్ కెంట్‌ 

ఇరాన్‌తో యుద్ధం సాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వంలో  అమెరికా జాతీయ ఉగ్ర నిరోధక విభాగం డైరెక్టర్‌   జోసెఫ్  కెంట్ తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న ఈ యుద్ధాన్ని తాను సమర్ధించడం లేదని, ఇందుకు తన అంతరాత్మ ఒప్పుకోదని జో కెంట్ వెల్లడించారు.  ఇప్పటికిప్పుడు ఇరాన్‌ నుంచి అమెరికాకు ఎలాంటి ముప్పు లేదని, అందువల్ల అమెరికాకు ఈ యుద్ధం అవసరం లేదని స్పష్టం చేశారు.   
కేవలం ఇజ్రాయెల్‌తో పాటు దాని శక్తిమంతమైన లాబీ చేసిన ఒత్తిడి తోనే ట్రంప్ ఇరాన్‌పై యుద్ధం ప్రకటించారని పేర్కొన్నారు.  ట్రంప్‌ ప్రభుత్వం చేస్తున్న ఈ యుద్ధానికి తన మనస్సాక్షికి విరుద్ధంగా మద్దతివ్వలేనని కెంట్ రాజీనామా లేఖలో రాసుకొచ్చారు.  కెంట్‌ను ఆ పదవిలో ట్రంపే స్వయంగా నియమించడం గమనార్హం.  కాగా ఇప్పటికే ఇరాన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలో భారీ నిరసనలు జరుగుతున్నాయి.  ఇజ్రాయెల్‌ కోసం అమెరికా సైనికుల ప్రాణాలను ట్రంప్‌ పణంగా పెట్టారని విమర్శలు వస్తున్నాయి.
ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ నుంచి అమెరికన్ల దృష్టిని మరల్చేందుకే యుద్ధం చేపట్టారన్న వాదన కూడా ఉంది.  అయితే, విదేశాలకు సంబంధించి ఇప్పటివరకు ట్రంప్ అనుసరించిన విధానాల్ని తాను సమర్ధి్స్తానని కెంట్ తెలిపారు.  ‘‘ఇరాన్‌తో కొనసాగుతున్న ప్రస్తుత యుద్ధానికి నేను మనస్సాక్షిని చంపుకుని మద్దతు ఇవ్వలేను.. ఇరాన్ వల్ల మన దేశానికి ఎటువంటి తక్షణ ముప్పు లేదు..కేవలం ఇజ్రాయెల్, దాని శక్తివంతమైన అమెరికా లాబీయింగ్ ఒత్తిడి చేయడం వల్లే మనం ఈ యుద్ధాన్ని ప్రారంభించామన్నది స్పష్టం’’ అని తన రాజీనామాలో కెంట్ తెలిపారు. 
ఇరాన్‌తో యుద్ధాన్ని ప్రేరేపించాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నంతో ఇజ్రాయెల్ సీనియర్ అధికారులు, అమెరికా మీడియాలోని ప్రభావిత వ్యక్తులు తప్పుడు సమాచారం ప్రచారం చేయడం ద్వారా యుద్ధ అనుకూల వాదాన్ని ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు. అమెరికాకు ఇరాన్ తక్షణ ముప్పుగా మారింది, ఇస్లామిక్ రిపబ్లిక్‌పై దాడి చేయాలని, తద్వారా విజయం త్వరగా లభిస్తుందని అధ్యక్షుడ్ని తప్పుదోవ పట్టించడానికి ఒక ‘ఎకో ఛాంబర్’ను ఉపయోగించారని కెంట్ నొక్కి చెప్పారు.

‘‘ఇజ్రాయెల్ సృష్టించిన ఈ యుద్ధం అమెరికా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు’’ అని కెంట్ నొక్కిచెప్పారు. ఒక కొత్త తరాన్ని మరణానికి పంపడాన్ని తాను సమర్థించలేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌కు కీలక సూచనలు చేశాడు. ‘‘2016, 2020, 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ చెప్పిన విషయాలు, విలువలకు నేను మద్దతుగా ఉన్నాను” అని చెప్పారు. 
 
“2025 జూన్ వరకు మిడిల్ ఈస్ట్‌ యుద్దాలు ఒక ట్రాప్‌లాగా భావించే వారు. వాటివల్ల అమెరికా సంపదకు నష్టం కలుగుతుందని, అమెరికా దేశ భక్తులైన సైనికుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని, మనకు ఆర్థికంగా నష్టం కలుగుతుందని భావించేవారు. ట్రంప్ మొదటి పాలనలో ఇతర ఆధునిక అధ్యక్షులకన్నా గొప్పగా ఆలోచించి, మన సైన్యాన్ని ఎలాంటి యుద్ధంలోకి పంపలేదు” అని గుర్తు చేశారు.

ఐసిస్ సంస్థను, క్వాసం సోలామని లాంటి వారిని అంతం చేసి మరీ ఇది నిరూపించారని తెలిపారు. అయితే, రెండోసారి ఎన్నికైన తర్వాత ఇజ్రాయెల్ ప్రభావంతో ఇరాన్‌ను ముప్పుగా భావించారని, దీంతో ఈ యుద్ధం మొదలైందని, వేలాది మంది అమెరికన్ సైనికుల ప్రాణాలు పణంగా పెట్టారని కెంట్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.  ఇప్పటికైనా ఈ పరిస్తితిని సరిదిద్ది అమెరికాకు ఒక చక్కని దారి చూపాలని తన లేఖలో కోరాడు. అధ్యక్షుడు ట్రంప్ పాలనలో పని చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపాడు.