ఇరాన్ భద్రతా మండలి అధిపతి అలీ లారిజానీ హతం!

ఇరాన్ భద్రతా మండలి అధిపతి అలీ లారిజానీ హతం!
పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ దేశ భద్రతా వ్యూహానికి సారథ్యం వహిస్తున్న ఆ దేశ భద్రతా మండలి అధిపతి అలీ లారిజానీ వైమానిక దాడిలో మరణించినట్లు ఇరాన్ ధృవీకరించింది. ఈ వైమానిక దాడిలో ఇరాన్ బసీజ్ కమాండర్ ఘోలం రెజా సులేమానీ కూడా మరణించారని ప్రకటించింది.ఇరాన్ పురోగతి, ఇస్లామిక్ విప్లవం కోసం జీవితాంతం కృషి చేసిన ఆయన, చివరికి తన కోరికను నెరవేర్చుకున్నారు. ఆయన గర్వంగా అమరులయ్యారు” అని భద్రతా మండలిని ఉటంకిస్తూ మెహర్ ఏజెన్సీ నివేదించింది.
ఇరాన్ సైనిక నాయకత్వంలో లారిజానీ అత్యంత కీలకమైన వ్యక్తి. ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతోల్లా ఖమేనీ హత్య తర్వాత, లారిజానీ దేశ భద్రతా బాధ్యతలు చేపట్టారు. ఇరాన్ సర్వోన్నత నాయకుడు ఖమేనీ హత్య తర్వాత యుద్ధంలో మరణించిన అత్యంత సీనియర్ ఇరాన్ నాయకుడు ఈయనే.  ఇరాన్ రాజకీయాల్లో కీలక వ్యక్తి అయిన లారిజానీ జరిపిన దాడుల్లో మరణించారని ఇజ్రాయిల్ ఇంతకుముందు తెలిపింది. 
ఇప్పటికే అమెరికా-ఇజ్రాయెల్‌తో యుద్ధంలో మొదటిరోజే తమ సుప్రీం ఆయతొల్లా ఖమేనిని కోల్పోగా, ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఆయన రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నట్టు, మరో అగ్ర కమాండర్‌ ఘోలమ్రెజా సోలేమాని ఇజ్రాయెల్‌ సోమవారం రాత్రి జరిపిన వైమానిక దాడుల్లో మరణించారని వార్తలు వచ్చాయి.  ఇరాన్‌లోని క్షిపణి తయారీ కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని టెహ్రాన్, షిరాజ్, తబ్రిజ్‌లలో ఏకకాలంలో వైమానిక దాడులు జరిపినట్లు ఇజ్రాయిల్ గతంలో ప్రకటించింది.
 
వీరిని ప్రధాన కార్యాలయంలో కాకుండ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడారాల ప్రాంతంలో చంపినట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి.   67 ఏండ్ల లారిజానీ ప్రస్తుతం ఇరాన్‌లో మొజ్త్తాబా తర్వాతి పదవిలో(స్థానంలో) ఉన్నారు. పరివర్తన కౌన్సిల్‌లో కలిసి ఆయన దేశంలోని పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని అంతమైన తర్వాత కూడా అమెరికా, ఇజ్రాయెల్ దళాలపై ఇరాన్ గట్టిగా పోరాడుతోంది. ఈ పోరాటం వెనుక ఉన్నది ఇరాన్ సెక్యూరిటీ చీఫ్‌ అలీ లారిజాని అని ఇజ్రాయెల్ విశ్వాసం.
ఆయన ఆధ్వర్యంలోనే ఇరాన్ పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది.  ఇటీవల లారిజన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు అంతం చేస్తా అంటూ కూడా హెచ్చరించాడు. అయితే, ఆయనెవరో కూడా తనకు తెలియదని ట్రంప్ తెలిపారు. మరోవైపు ముస్లిం దేశాలు తమకు మద్దతుగా నిలవకపోవడంపై లారిజన్ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇరాన్ సైన్యాన్ని దాడుల్ని లారిజాని పర్యవేక్షిస్తు్న్నట్లు తెలుస్తోంది.

ఖమేనీ హతమవ్వడం, ఆయన తనయుడు మొజ్తాబా గురించి స్పష్టత లేకపోవడంతో ప్రస్తుతం ఇరాన్‌లో లారిజాని నెం.2 స్థానంలో ఉన్నాడు. ఒకపక్క లారిజాని మరణించాడని ఇజ్రాయెల్ చెబుతుంటే ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలో ఒక చేతిరాతతో కూడిన పోస్ట్ వెలువడింది. లారిజాని ఖమేనికి అత్యంత సన్నిహితుడు. ఇటీవల అమెరికాతో జరిపిన అణు చర్చల్లో కూడా అతడు కీలక పాత్ర పోషించాడు. అతడిని ఇరాన్ ప్రజలు కెన్నడీ ఆఫ్ ఇరాన్‌గా పిలుస్తారు.

శుక్రవారం నాడు టెహ్రాన్‌లో జరిగిన ‘కుద్స్ దినోత్సవ’ ర్యాలీలలో లారిజాని పాల్గొనడం కనిపించింది. ఆ రోజు తర్వాత, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో సంబంధం ఉన్న 10 మంది ప్రముఖుల జాబితాలో భాగంగా లారిజానితో సహా ఇరాన్‌కు చెందిన సీనియర్ సైనిక, గూఢచార అధికారులకు సంబంధించిన సమాచారం అందించిన వారికి 10 మిలియన్ డాలర్ల వరకు బహుమతిని అమెరికా ప్రకటించింది.